: ఐదేళ్లలో సీపీఐ, సీపీఎంలు కలసిపోతాయ్: సురవరం సుధాకర్ రెడ్డి

ఐదేళ్ల కాలంలో సీపీఐ, సీపీఎంలు ఒక్కటవుతాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని... ఈ కారణమే ఇరు పార్టీలను మళ్లీ ఏకం చేస్తుందని చెప్పారు. రెండు పార్టీలు కలిస్తేనే మనుగడ సాధ్యమవుతుందని... లేకపోతే ఇరు పార్టీలకు ఇబ్బందులు తప్పవని అన్నారు. రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పోరాటాలు సాగిస్తున్నాయని, అయితే, వేర్వేరుగా పోరాటం చేస్తుండటంతో అనుకున్నది సాధించలేకపోతున్నామని చెప్పారు.

రెండు పార్టీలు కలిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. అనేక విషయాల్లో ఇరు పార్టీలు ఇప్పటికే కలసి పని చేస్తున్నాయని... అయితే, ఏకీకరణకు సీపీఎం ముందుకు రావడం లేదని తెలిపారు. విలీనంపై సానుకూల దృక్ఫథం ఉన్నప్పటికీ... ఆ పార్టీ నేతలు ఇంకా ముఖాముఖి చర్చలకు రాలేదని అన్నారు. వచ్చే ఏడాది ఇరు పార్టీల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు ఉన్నాయని... అప్పుడైనా విలీనం అంశం చర్చకు వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News