: 'లేటు'గా వచ్చే రైళ్లలో ఫ‌స్ట్‌ ర్యాంక్ .... 'మండ్వాడీ-రామేశ్వ‌రం ఎక్స్‌ప్రెస్‌' కొట్టేసింది!

మ‌న దేశంలో రైళ్లు టైంకు రావు అనే చెడ్డ‌పేరు ఉంది. గంటో అర‌గంటో కాదు, ఏకంగా గంట‌ల‌కొద్దీ లేటుగా వ‌చ్చే రైళ్లు దేశ‌వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. వాట‌న్నింటినీ స‌ర్వే చేసి జాబితా త‌యారుచేసిందో కంపెనీ. ఈ జాబితాలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మండ్వాడీ నుంచి త‌మిళ‌నాడులోని రామేశ్వ‌రం వ‌ర‌కు వెళ్లే మండ్వాడీ-రామేశ్వ‌రం వీక్లీ ఎక్స్‌ప్రెస్ స‌రాస‌రి 11.5 గంట‌లు లేటుతో మొద‌టిస్థానం ఆక్ర‌మించుకుంది. 2000 కి.మీ.లు ప్ర‌యాణించే ఈ రైలు త‌ర్వాత, ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి జ‌మ్ముతావి వ‌ర‌కు వెళ్లే హిమ‌గిరి సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రెండో స్థానంలో ఉంది. దీని స‌రాసరి లేటు 9.3 గంట‌లు. అలాగే అమృత్‌స‌ర్ నుంచి బిహార్‌లోని ద‌ర్భంగా వెళ్లే జ‌న నాయ‌క్ ఎక్స్‌ప్రెస్ 8.9 గంట‌ల స‌రాస‌రి లేటుతో మూడో స్థానంలో నిలిచింది. 2 కోట్ల మంది ప్ర‌యాణికుల‌ను స‌ర్వే చేసి ఈ జాబితా త‌యారుచేశారు.

అలాగే ప్ర‌యాణికుల‌కు బాగా ఇష్ట‌మైన రైల్వే స్టేష‌న్లుగా వ‌డోద‌ర‌, హౌరా, నాగ్‌పూర్ స్టేష‌న్లు నిల‌వ‌గా, న్యూఢిల్లీ, పూణె, కాన్పూర్ స్టేష‌న్ల‌పై ప్ర‌యాణికులు పెద్ద‌గా మ‌క్కువ చూపించ‌లేదు. బాగా ఇష్ట‌మైన రైళ్లుగా బిక‌నీర్‌-ఢిల్లీ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌, ముంబై-జైస‌ల్మేర్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌, న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్‌లు నిలిచాయి. పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌, జార్ఖండ్ ఎక్స్‌ప్రెస్‌, సీమాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లు ఇష్టం లేని ట్రైన్ల జాబితాలో చేరాయి. ఇక ర‌క్ష‌ణ‌, శుభ్ర‌త విష‌యంలో రాజ్‌కోట్ జంక్ష‌న్‌కి, బిక‌నీర్-ఢిల్లీ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కి మంచి మార్కులు ప‌డ‌గా, ఆహారం విష‌యంలో క‌ర్ణాట‌క‌లోని దేవ‌న‌గ‌ర జంక్ష‌న్‌కి, అహ్మ‌దాబాద్‌-ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్‌కి ప్ర‌యాణికులు మొద‌టి ర్యాంకు ఇచ్చారు.

More Telugu News