: నేను, కేశవరావు, స్వామిగౌడ్ దేవాలయానికి నడిచే వచ్చాం!: దత్తాత్రేయకు అవమానంపై తలసాని

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రాంగణం చిన్నదిగా ఉండటం, ఇరుకు సందుల కారణంగా, అమ్మ దర్శనం కోసం తరలివచ్చిన అశేషమైన భక్తులకు కొన్ని ఇబ్బందులు కలిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భక్తులకు సౌకర్యంగా ఉండటం కోసం క్యూలైన్లు ఏర్పాటు చేసినప్పటికీ, రోడ్డుపై కూడా అసంఖ్యాక భక్తులు నడుస్తుండటంతో వాహనాల రాకపోకలను రాంగోపాల్ పేట సమీపంలోనే నిలిపివేయడం జరిగిందని అన్నారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తన సతీమణితో కలసి ఆలయానికి వచ్చిన వేళ, ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా, ఆలయం వరకూ తన వాహనాన్ని అనుమతించలేదని ఆయన విమర్శించిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన తలసాని, తాను, ఎంపీ కేశవరావు, స్వామిగౌడ్ తదితరులమంతా చాలా దూరం నడిచే ఆలయానికి వచ్చామని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రద్దీ సమయంలో వచ్చారని, ఆయనకు ఇబ్బందులు కలిగుంటే, ప్రభుత్వం తరఫున, దేవాలయం పక్షాన మన్నించాలని కోరుతున్నట్టు తెలిపారు. ఇది కావాలని జరిగిన ఘటన కాదని తెలిపారు. అన్ని పార్టీల వారూ అలాగే వచ్చారని, రద్దీ ఎక్కువగా ఉన్నందునే పోలీసులు ఎవరు వచ్చినా వారి వాహనాలను దూరంగానే నిలిపేశారని తెలిపారు.

More Telugu News