: ఒబామా చేయలేని పనిని నేను చేస్తున్నా: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరూ ఊహించలేని ప్రకటన చేశారు. అమెరికాతో రష్యాది తరాల శత్రుత్వం. ప్రపంచంపై ఆధిపత్యం కోసం రెండు దేశాలు విపరీతంగా ప్రయత్నించేవి. అయితే సోవియట్ యూనియన్ ముక్కలు కావడంతో అమెరికా ప్రపంచానికి పెద్దన్నగా మారిపోయింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో రష్యా సాయంతో ట్రంప్ గెలిచారని, రష్యా రహస్యంగా ట్రంప్ కు సాయం చేసిందని, హ్యాకింగ్ కారణంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని తీవ్ర ఆరోపణలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా భవిష్యత్ ఎన్నికల్లో హ్యాకింగ్ జరగకుండా ఉండేందుకు రష్యాతో కలిసి ‘సైబర్ సెక్యూరిటీ యూనిట్’ ను ఏర్పాటు చేస్తున్నామని ట్రంప్ ప్రకటన చేశారు.

 జీ20 సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ తో తాను భేటీ అయ్యానని ఆయన చెప్పారు. ఈ సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హ్యాకింగ్ గురించి చర్చించామని, అలాంటిదేమీ లేదని పుతిన్ సమాధానమిచ్చారని ట్రంప్ తెలిపారు. ఒకవేళ హ్యాకింగ్ కు సంబంధించిన సమాచారం ఒబామాకు ముందుగానే తెలిస్తే ఒబామా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఒబామా చేయలేని పనిని తాను చేయబోతున్నానని, హ్యాకింగ్ నిరోధానికి రష్యాతో కలిసి చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, హ్యాకింగ్‌ కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన రష్యాతోనే ట్రంప్ జట్టు కట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

More Telugu News