: అమెరికా అధ్యక్షుడి స్థానంలో కూర్చున్న ఇవాంకా... 'కవర్' చేసుకోవడానికి వైట్ హౌస్ పాట్లు!

హాంబర్గ్ లో జీ-20 సమావేశాలు జరుగుతున్న వేళ, తన తండ్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం కేటాయించిన కుర్చీలో ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ కూర్చోవడం, ఇతర దేశాల అధినేతలతో చర్చల్లో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వస్తుండగా, ఆమె చర్యను సమర్థించుకునేందుకు వైట్ హౌస్ నానా పాట్లూ పడుతోంది. జీ-20 రెండో రోజు సమావేశాల్లో భాగంగా, కీలకమైన చర్చలు జరుగుతుండగా, ట్రంప్ మరో కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం లేచి వెళ్లిపోయారు.

ఆ వెంటనే ఇవాంకా వచ్చి ఆ సీట్లో కూర్చున్నారు. ఆ పక్కనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఉన్నారు. దేశాధినేతల మధ్య ఆమె కూర్చోవడాన్ని ప్రశ్నిస్తూ, ఆమెకున్న హోదా ఏంటని విమర్శకులు ప్రశ్నించారు. ఇక, ట్రంప్ బయటకు వెళ్లడంతోనే ఆమె వచ్చారని, సదస్సులోని పలు చర్చల్లో ఇవాంకా చురుకుగా పాల్గొన్నారని, ముఖ్య నేతలు బయటకు వెళితే, వారి ప్రతినిధులు చర్చలను కొనసాగించడం సాధారణమేనని వైట్ హౌస్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇక ఓ దేశ ప్రతినిధిగా ఏ అర్హతలూ లేని, ప్రజలతో ఎన్నుకోబడని యువతి అవసరమయ్యారా? అంటూ ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు పలువురు నేతలకు ఇవాంకాను పరిచయం చేసిన ట్రంప్, తన కుమార్తె చాలా గొప్పదని, ఆమె తనకు గర్వకారణమని పొగడ్తలు గుప్పించారు.

More Telugu News