: అవసరం వచ్చినప్పుడు నేనే స్వయంగా కిమ్ జాంగ్ ఉన్ ను కలుస్తా...అంతవరకు శాంతించండి: పుతిన్ ప్రకటన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీలోని హాంబర్గ్ లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏ మాత్రం సహనం కోల్పోయినా ఇంత కాలం ఎదురు చూస్తూ కొనసాగించిన శాంతి మార్గం ధ్వంసమవుతుందని హెచ్చరించారు. అందుకే ఉత్తర కొరియా విషయంలో ఎవరూ సహనం కోల్పోవద్దని ఆయన సూచించారు. హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ఉత్తర కొరియా తన అణుకార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రమాదకరంగా మారుతోందంటూ మూన్‌ జే ఇన్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఉత్తర కొరియా అణు సమస్య చాలా తీవ్రమైనదని ఆయన అంగీకరించారు.

అయితే, ఈ విషయంలో ఏ ఒక్కరు తమ సహనాన్ని కోల్పోయినా ప్రపంచానికే పెను ప్రమాదమని ఆయన హెచ్చరించారు. సున్నితమైన ఈ అంశాన్ని కార్యసాధన ద్వారా పరిష్కరించాలని ఆయన సూచించారు. మరింత ప్రమాదకరంగా మారి, చేయిదాటే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం తాను స్వయంగా రంగంలోకి దిగి ఉత్తర కొరియా అధ్యక్షుడుని కలుసుకుని మాట్లాడుతానని ఆయన ప్రకటించారు. అది ఎప్పుడన్నది చెప్పలేమని... అది ఎప్పుడైనా, ఎక్కడైనా కావచ్చని ఆయన తెలిపారు. 

More Telugu News