: అసెంబ్లీలో నీరు నుంచి కులాల మీటింగుల వరకూ... ఈ వ్యూహకర్తల పనే: దేవినేని కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో, సొంత టీవీ చానళ్లలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న కథనాలన్నీ వ్యూహకర్తలపనేనంటూ, ఏపీ మంత్రి దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో పైపులు కోయించుకుని, ఆపై వర్షపు నీరు లోపలికి వస్తే, విషయం అసెంబ్లీ కార్యదర్శికి తెలిసేంతలోపే, సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని ఆరోపించిన ఆయన, వైకాపాకు నీరు వస్తుందని ముందు తెలుసునని, అది వ్యూహకర్తల ఆలోచనతోనే సాగిందని ప్రశాంత్ కిశోర్ పేరు వెల్లడించకుండా విమర్శించారు. ఇప్పుడు కులాల మీటింగులు పెట్టి ప్రజల్లో అడ్డుగోడలు సృష్టించాలని ఇదే వ్యూహకర్తలు ప్లాన్ చేశారని, రేపు మతకల్లోలాలు సృష్టించేందుకు కూడా వీరు వెనుకాడబోరని ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి, జగన్ వారసుడని, ఎర్రచందనాన్ని తీసుకెళ్తూ పట్టుబడి, తమ సంస్థలపై ఆరోపణలు చేయిస్తున్నారని, అది కూడా వ్యూహకర్తల పనేనని అన్నారు. అధికారం కోసం అర్రులు చాస్తూ, జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతి శుక్రవారం కోర్టుకు తిరిగే జగన్, మూడు నెలలకోసారి ధర్నాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, ఎందరు వ్యూహకర్తలను పెట్టుకున్నా ప్రజాభిమానం దక్కదని అన్నారు. జగన్ దుర్మార్గాలను ప్రభుత్వం తిప్పి కొడుతుందని హెచ్చరించారు.

More Telugu News