: సుష్టుగా తినాల్సిన పనిలేదు... హాయిగా వాసన చూసినా లావైపోతాం!: శాస్త్రవేత్తలు

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో ఊబకాయం ప్రధానమైనది. మారుతున్న కాలానుగుణ పరిస్థితుల నేపథ్యంలో జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం వస్తోందని నిపుణులు పేర్కొంటూ ఉండడం చూస్తూనే వున్నాం. అయితే ఊబకాయం వచ్చేందుకు కడుపునిండా తినాల్సిన అవసరం లేదని, ఇష్టమైన ఆహారాన్ని హాయిగా ముక్కుతో వాసన చూడడం కూడా ఊబకాయానికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. బర్కిలీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ మేరకు వివిధ జాతులకు చెందిన ఎలుకలపై పరిశోధనలు నిర్వహించారు.

వాసన చూడలేకపోతే తినే ఆహారాన్ని తొందరగా అరిగించేసుకోగలమని వారు చెబుతున్నారు. ఎలుకల్లాగే మనుషులకు కూడా వాసన చూసే శక్తి ఎక్కువగా ఉంటుందని, ఇష్టమైన ఆహారం వాసన తగలగానే లొట్టలేసుకుని తినేయాలన్నంత కోరిక పుడుతుందని, నచ్చినది రెండు ముద్దలు ఎక్కువ తింటామని, ఇది అరిగేందుకు ఎక్కువ సమయం పడుతుందని వారు చెప్పారు. అందువల్ల ఊబకాయం వస్తుందని వారు వివరించారు. ఈ మేరకు ఎలుకలను విభాగాలుగా విభజించి పరిశోధనలు నిర్వహించామని వారు చెప్పారు. వాసన పసిగట్టే సామర్థ్యం ఎక్కువ ఉన్న సూపర్ స్మెల్లర్ ఎలుకలు ఏమీ తినకపోయినా వాసన చూడడం వల్ల లావుగా తయారయ్యాయని వారు వెల్లడించారు.

ఆహారం వెతికేటప్పుడే శరీరం కేలరీలను నిల్వ చేసుకుంటుందని, అన్నం దొరికేస్తే వాటిని మండిస్తుందని వారు తెలిపారు. అందుకే ఎలుకల్లో జన్యుచికిత్స చేసి, ఘ్రాణ శక్తిని హరించి వేసిన తరువాత మళ్లీ పరిశోధించగా...లావుగా ఉన్న ఎలుకలు కూడా వాసన చూసే సామర్థ్యం కోల్పోయిన అనంతరం రెండు ముద్దలు ఎక్కువ తిన్నా బరువు తగ్గాయని, దీంతో బరువు పెరగడం వెనుక కారణం కేవలం బాగా తినడం మాత్రమే కాకుండా పలు అంశాలు దోహదం చేస్తాయని, అందులో మనసుకింపైన ఆహారం వాసన చూడడం కూడా ఒక కారణమని వారు తెలిపారు. ఆహారం వాసన చూడలేకపోతే ఆహారాన్ని నిల్వ చేసుకోకుండా త్వరగా అరిగించుకోగలమని వారు తెలిపారు.

More Telugu News