: మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఫలితం.. అంతరిక్ష రంగంలో దశాబ్దాల దోస్తీ మరింత దృఢతరం.. ఇరు దేశాల మధ్య మూడు ఒప్పందాలు!

అంతరిక్ష రంగంలో ఇజ్రాయెల్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ బంధం మరింత బలపడింది. మోదీ పర్యటన సందర్భంగా బుధవారం ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మూడు ఒప్పందాలు కుదుర్చుకుంది. చిన్న ఉపగ్రహాల కోసం ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ల తయారీలో సహకారం మొదటి ఒప్పందం కాగా, రెండోది  జీఈవో-ఎల్ఈవో ఆప్టికల్ లింక్స్ విషయంలో సహకారం. అణు గడియారాల విషయంలో పరస్పర సహకారం మూడో ఒప్పందం.

స్పేస్ టెక్నాలజీలో ఇరు దేశాలు చేతులు కలపడం ఇదే తొలిసారి కాదు. ఇస్రో, ఇజ్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) మధ్య దశాబ్దాల బంధం ఉంది. ఉపగ్రహాల అభివృద్ధి, ప్రయోగం విషయంలో ఇరు దేశాల మధ్య సహాయ  సహకారాలు కొనసాగుతున్నాయి. జనవరి 21, 2008లో ఇజ్రాయెల్ తన సొంత రాకెట్ ‘షవిట్’‌ను కాదని భారత గెలుపు గుర్రం పీఎస్ఎల్‌వీ సీ-10 ద్వారా తన నిఘా ఉపగ్రహం టీఈసీ ఎస్ఏఆర్‌ను నింగిలోకి పంపింది.

ఇందుకు  మూడు కారణాలున్నాయి. ఇజ్రాయెల్ తన భూభాగం నుంచి ఏదైనా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపాలంటే తొలుత దానిని పశ్చిమం (సముద్రం) దిశగా ప్రయోగించాల్సి ఉంటుంది. ప్రయోగం విఫలమైతే అది జనావాసాల్లో, ముఖ్యంగా విదేశీ భూభాగంలో పడకుండా ఉండేందుకు ఇలా చేయడం తప్పనిసరి. భూ భ్రమణానికి వ్యతిరేకంగా అలా చేయాల్సి వస్తే ఉపగ్రహ బరువును తగ్గించాల్సి ఉంటుంది. ఇక రెండోది.. గతంలో ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒఫెక్ సిరీస్ నిఘా ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకోవడంలో ఇబ్బంది పడ్డాయి. మూడోది.. టీఈసీ ఎస్ఏఆర్‌ ఉపగ్రహాన్ని ఇజ్రాయెల్ 450-580 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. అయితే అంత ఎత్తుకు మోసుకుపోయే శక్తి ఆ దేశ రాకెట్లకు లేదు. కాబట్టే ఆ దేశం ఇస్రోను ఆశ్రయించింది. పీఎస్ఎల్‌వీ దానిని భూభ్రమణానికి వ్యతిరేక దశలో మోసుకెళ్లి కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. టీఈసీ ఎస్ఏఆర్ తర్వాత కూడా ఇజ్రాయెల్‌కు చెందిన పలు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఇటీవల ఇస్రో కక్ష్యలో ప్రవేశపెట్టిన 104 నానో ఉపగ్రహాల్లో ఇజ్రాయెల్‌కు చెందినవి మూడు ఉన్నాయి.  

More Telugu News