: పాత్ర కోసం ప్రాణం పెట్టడమంటే ఇదేనట!

సరైన పాత్రలు రావడం లేదని పలువురు నటులు పలు సందర్భాల్లో వాపోతుంటారు. అయితే అందివచ్చిన అవకాశాలను అద్భుతంగా మలచుకుంటారు మరికొందరు. రాజ్ కుమార్ రావ్ బాలీవుడ్ లో అరకొర సినిమాల్లో నటించినా మంచి నటుడనిపించుకున్నాడు. జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. తాజాగా నటన పట్ల అతనికున్న నిబద్ధతకు నిదర్శనంగా చూపే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'ట్రాప్డ్' సినిమా కోసం బక్కచిక్కాలని దర్శకుడు చెప్పగానే మూడు వారాలపాటు రూంలోకి వెళ్లి తలుపేసుకుని, కేవలం కేరట్లు మాత్రమే తింటూ బక్కచిక్కిపోయాడు. ఆ తరువాత 'బెహన్ హోగీ తెరీ' సినిమాలో పాత్ర కోసం సిక్స్ ప్యాక్ కావాలనగానే అందుకు తగ్గట్టు శ్రమించి, సిక్స్ ప్యాక్ సంపాదించేశాడు. తాజాగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాస్ చంద్రబోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చి, కొంచెం లావవ్వమన్నాడు. అంతే, వెంటనే పొట్ట పెంచేశాడు.

ఈ మేరకు ఫోటో పోస్టుచేసిన రాజ్ కుమార్ రావు... 'తనకు పాత్రలో ఒదిగిపోవడం కంటే మించిన ఆనందం ఇంకోటి ఉండద'ని ట్వీట్ చేశాడు. ఇది అతని అభిమానులు ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో చూసిన అతని అభిమానులు రాజ్ కుమార్ రావు కు నటన పట్ల చాలా నిబద్ధత ఉందని కీర్తిస్తున్నారు. పలువురు అభిమానులు పాత్ర కోసం ప్రాణం పెట్టడం అంటే ఇదేనని అభినందిస్తున్నారు. కాగా, ఇలాగే పాత్ర కోసం సౌత్ ఇండియా హీరో విక్రమ్ చాలా కష్టపడతాడన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ఈ విషయంలో మిస్టర్ పర్ ఫెక్ట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

More Telugu News