: మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై భారత సంతతి హర్షాతిరేకం!

ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన భారతీయుల్లో ఆనందాన్ని నింపింది. ఇజ్రాయిెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పలికిన ఆత్మీయ ఆహ్వానం, ప్రధాని నరేంద్ర మోదీని వెన్నంటి ఉండి, ఆయనతోనే గడపడం, రెండు దేశాలు చేసుకున్న ఒప్పందాలు... ఇవన్నీ ఇజ్రాయెల్ లోని 8 లక్షల మంది భారత సంతతి వారిని ఆనందపరవశులను చేశాయి.  భారత్ కు చెందిన నాలుగు తెగలకు చెందినవారు దశాబ్దాలుగా ఇజ్రాయెల్ లో నివసిస్తున్నారు. వారిలో ముంబైకి చెందిన బెనీ తెగ, కేరళలోని కొచిన్‌ కు చెందినవారితో పాటు మణిపూర్, మిజోరాంలకు చెందిన బినై మెనషే తెగవారు ప్రధానంగా వున్నారు.

దీనిపై ఇజ్రాయెల్ లో డ్రైవర్ గా స్థిరపడిన డేవిడ్ నగని మాట్లాడుతూ, 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తాను ఇక్కడికి వలస వచ్చానని తెలిపారు. అయితే భారత్‌ తో అప్పట్లో ఇజ్రాయెల్ కు దౌత్యసంబంధాలు లేవని తెలియగానే మొదట్లో చాలా బాధ కలిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. వాస్తవానికి దాని వల్ల వచ్చే ఇబ్బందులేమిటో కూడా తనకు తెలియవని, అయితే ఇజ్రాయెల్ లో యూదులకు ఎంత గౌరవం లభిస్తుందో భారతీయులకు కూడా అంతే గౌరవం లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రధాని పర్యటనలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మన ప్రధానికి ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యత తనకు చాలా ఆనందం కలిగించాయని ఆయన పేర్కొన్నారు.  

More Telugu News