: చంద్రబాబు 'హెరిటేజ్' బ్రాండును వాడుకున్న ఎర్రదొంగలు!

హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న వైనం వెలుగు చూడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే, అది హెరిటేజ్ కంపెనీకి చెందిన వాహనం కాదని తేలింది. ఎర్రదొంగలు తమ స్మగ్లింగ్ కోసం ఇప్పటి వరకు పోలీస్, అంబులెన్స్, ప్రెస్ వాహనాలను పోలిన వెహికల్స్ ను వాడారు. తాజాగా, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థకు చెందిన వాహనాన్ని పోలిన వాహనంలో ఎర్రదుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారు. హెరిటేజ్ వాహనాన్నైతే ఎవరూ ఆపరనే ధైర్యంతో తమ వాహనానికి హెరిటేజ్ లేబుల్ వేసుకుని, అందులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, హెరిటేజ్ వ్యానును పోలిన వాహనంతో పాటు రూ. 3 కోట్ల విలువైన దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఐటీ కాంతారావు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఎర్రదొంగల స్మగ్లింగ్ తీరును వివరించారు. స్మగ్లర్ల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ జరుపుతుండగా.... వారికి వంద మందికి పైగా స్మగ్లర్లు తారసపడ్డారని, వెంటనే పోలీసులపై రాళ్లతో దాడి చేశారని చెప్పారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరపగా... స్మగ్లర్లు పారిపోయారని తెలిపారు. ఈ సందర్భంగా ఘటనా స్థలం నుంచి హెరిటేజ్ సంస్థ పేరుతో ఉన్న నకిలీ వాహనాన్ని సీజ్ చేశామని... తరలింపుకు సిద్ధంగా ఉన్న రూ. 3 కోట్ల విలువైన 71 దుంగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ వాహనం తమిళనాడుకు చెందినదని వెల్లడించారు. ఒరిజినల్ నంబర్ ప్లేట్ పై ఏపీకి చెందిన నంబరును అతికించారని చెప్పారు. అసలైన నంబర్ ను పరిశీలిస్తే... వాహనం తమిళనాడులోని గుమ్మిడిపూండికి చెందినట్టుగా తేలిందని చెప్పారు. 

More Telugu News