: రామారావుగారి జీవితంలో నెగెటివ్ అనేదే లేదు!: పోసాని

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీస్తానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ప్రకటించారు. ఈ విషయమై ఓ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, ‘పుట్టిన ప్రతివ్యక్తి చనిపోయే వరకూ ఎన్నో గొప్ప పనులు చేసి ఉండొచ్చు కానీ, తనకు తెలియకుండానే పొరపాట్లు కూడా చేస్తాడు. నేనూ చేశాను. నెహ్రూ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి, మోదీ గారు కానీ, ఎంత పెద్ద లీడర్స్ అయినా వీళ్ల గొప్ప గొప్ప జీవితాల్లో తెలియకుండా జరిగిన పొరపాట్లు చాలా ఉంటాయి. ఒక వ్యక్తికి సంబంధించిన నెగెటివ్ అంశాలను టచ్ చేయకూడదు.. ఆ అంశాలు ఎలాంటివి అంటే.. రామారావుగారు పదవిని అడ్డుపెట్టుకుని కొడుకులకు దోచిపెట్టారు, భూ కబ్జా చేశారు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, కుటుంబాన్ని ప్రేమించలేదు, సినిమారంగంలో మోసం చేశారు.. వంటి అంశాలకు ఆధారం ఉంటే కనుక చెప్పాలి.

ఈ విషయాల్లో రామారావుగారు మచ్చలేని వ్యక్తి. బసవతారకం గారు చనిపోయే వరకు ఆమెను దేవతలా ప్రేమించారు. ఆమె కేన్సర్ వ్యాధితో మరణిస్తే చిన్నపిల్లాడిలా విలపించారు. ఆయన జీవితంలో ప్రతి అంశం నిజాయతీతో కూడుకున్నదే. ప్రజల కోసం వచ్చిన ఎన్టీఆర్ జీవితంలో అవినీతి లేదు. ఆయన సినీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలోనూ ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. చివరకు, లక్ష్మీపార్వతిగారిని కూడా రామారావుగారు మోసం చేయలేదు. నిజాయతీగా నిలబడి ఆమెతో చివరిదాకా ఉన్నారు.

ఇక, రామారావుగారి జీవితంలో నెగెటివ్ ఏముంది? ఏమీ లేదు. ఇది వాస్తవం. నేనేమీ, రామారావుగారి తరపున వకాల్తా పుచ్చుకోవట్లా. ఆయనేమీ బతికిలేరు. ఆయన్ని కాకాపట్టి పదవి తీసుకోవడానికి. రామారావుగారు ఒక లెజెండ్.. అలా వదిలేయండి. ఫైనల్ గా నేను చెప్పేదేంటంటే.. ఎన్టీఆర్ పై సినిమా తీస్తే తెరపై చూసుకోవాలని ఎవరికైనా ఉండటం వందశాతం సమంజసమే. ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషిగా నేను ఏం చెబుతానంటే.. ఇంతకుముందు ఎవరెవరి జీవితచరిత్రలు సినిమాలుగా తీశారో, అవన్నీ ఆల్ మోస్ట్ కాంట్రావర్సీ అయ్యాయి. ఇప్పుడు, ఇంత గొప్పమనిషి గురించి మళ్లీ సినిమా తీస్తే, ఏ కొంచెం బాధపడ్డా, అది తెలుగు ప్రపంచం మొత్తం బాధపడుతుంది, అందరూ బాధపడాలి. బయోపిక్ తీయకపోతే, ఆ మధుర స్మృతులన్నీ మన మనసుల్లో, మన గుండెల్లో ఉంటాయి’ అని చెప్పారు.

More Telugu News