: రాష్ట్రపతి కాకముందే కోవింద్ ముందు డిమాండ్లు ఉంచిన చంద్రబాబు!

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో వీరి సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రపతిగా కోవింద్ గెలుపు ఖాయమని చెప్పారు. తనకు తెలిసినంత వరకు 75 శాతం ఓట్లు కోవింద్ కు పడతాయని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మొత్తం ఓట్లు కోవింద్ కు పడే అవకాశం ఏపీలోనే ఉందని చెప్పారు. ఏపీలో టీడీపీ, వైసీపీలు రెండూ కోవింద్ కే సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోవింద్ ముందు డిమాండ్లు పెట్టారు. ఏపీ చాలా కష్టాల్లో ఉందని... రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలను రాష్ట్రం ఎదుర్కొంటోందని కోవింద్ దృష్టికి చంద్రబాబు తీసుకొచ్చారు. ఏపీని నిర్మించుకునే పనిలో ఉన్నామని... మీ నుంచి తమకు పూర్తి సహకారం అవసరమని కోవింద్ ను కోరారు. ఏపీ మూడేళ్ల చిన్నారి అని... రాజధాని అమరావతిని నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు.

ఇటీవల ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితాలో అమరావతికి చోటు కల్పించినందుకు కేంద్ర మంత్రి వెంకయ్యకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. ఏపీకి చేయడానికి ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా వెంకయ్య వదలడం లేదనే విషయాన్ని కోవింద్ కు చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎంతో సహకరిస్తున్నారని కితాబిచ్చారు. కొత్త రాష్ట్రం కావడం వల్లే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఏపీ నుంచి ఒక్క ఓటు కూడా మురిగిపోదని... ఏపీలో ఉన్న మొత్తం ఓట్లు మీకే పడతాయని అన్నారు. 

More Telugu News