: చైనా వైఫల్యం - ఇస్రోకు మహద్భాగ్యం!

ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాల్లో చైనా వరుసగా విఫలమవుతుండగా, ఇస్రోకు మాత్రం డిమాండ్ పెరిగిపోతోంది. చైనా 'లాంగ్ మార్చ్ 5' ప్రయోగం కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేర్చడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఈ వైఫల్యంతో చంద్రుడిపై నుంచి నమూనాలు తేవాలన్న చైనా ప్రయత్నాలు ఆలస్యం అవుతాయని, అది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, మరింత వేగంగా అంతరిక్షంలో ఆధిపత్యాన్ని పెంచుకునే వెసులుబాటును దగ్గర చేయనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

"చైనా ఇక అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు తగ్గించుకోక తప్పదు. ఈ తరహా వైఫల్యాలు వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతాయి" అని యూఎస్ నావల్ వార్ కాలేజ్ ఎక్స్ పర్ట్ జోన్ జాన్సన్ ఫ్రీజ్ వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు చైనా ప్రయోగించిన భారీ రాకెట్ వైఫల్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది దురదృష్టకరమేనని, చైనా శాస్త్రవేత్తలు ఎంతో బాధపడివుంటారని ఆయన అన్నారు.

ఇక ఇదే సమయంలో ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతుంటే, అమెరికా సహా ఎన్నో దేశాలు తమ ఉపగ్రహాలను పంపేందుకు ఇస్రోను ఆశ్రయిస్తున్నాయని గుర్తు చేశారు. ఇస్రో తలపెట్టిన మంగల్యాణ్ విజయవంతమై, రెడ్ ప్లానెట్ గురించిన మరింత సమాచారం తెస్తే, చైనా పూర్తిగా వెనుకబడిపోయినట్టేనని అన్నారు. లాంగ్ మార్చ్ 5 వైఫల్యం ఇస్రోకు అదృష్టాన్ని తెచ్చి పెట్టనుందని, ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ రానున్నాయని జాన్సన్ ఫ్రీజ్ అంచనా వేశారు.

More Telugu News