: ఆ ఘనత మాత్రం కేసీఆర్ ఒక్కరిదే: వెంకయ్య పొగడ్తలు

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో సహృదయుడు, సహనశీలి అయిన రామ్ నాథ్ కోవింద్ ను తాము నిలిపితే, కేంద్ర ప్రభుత్వంలో భాగం లేని పార్టీల్లో తొలుత మద్దతు పలికింది టీఆర్ఎస్ పార్టీయేనని, కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి రామ్ నాథ్ కు మద్దతిస్తామని అన్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో రామ్ నాథ్ సమావేశమైన వేళ, వెంకయ్య మాట్లాడుతూ, ఇతర పార్టీల అధినేతల్లో కోవింద్ కు మొట్టమొదట మద్దతిచ్చిన ఘనత కేసీఆర్ దేనని, అందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

 హైదరాబాద్ కు వచ్చిన రామ్ నాథ్ కు ఘనస్వాగతం పలికారని కొనియాడారు. ఈ స్వాగతం ఆయనకు చాలాకాలం గుర్తుండిపోతుందని, తెలంగాణపై ఆయనకు ప్రేమను పెంచుతుందని తెలిపారు. యూపీలోని ఓ చిన్న గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టిన రామ్ నాథ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. న్యాయకోవిదుడైన ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో సైతం వాదించారని గుర్తు చేశారు. మురార్జీ దేశాయ్ కి పర్సనల్ అసిస్టెంట్ గా పని చేసిన అనుభవమూ ఉందని తెలిపారు. బీజేపీ దళితమోర్చాకు మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారని చెప్పారు. ఆయనకు మద్దతిచ్చి కేసీఆర్ తన మంచి మనసును చాటుకున్నారని చెప్పారు.

More Telugu News