: జీఎస్టీ ఎఫెక్ట్... టీవీల ధరలను పెంచిన తొలి కంపెనీగా నిలిచిన ఎల్జీ

మీరు కొత్తగా ఓ టీవీ కొనాలని అనుకుంటున్నారా? ఇప్పుడు షోరూముకు వెళితే, అయ్యో... ఓ వారం ముందు కొని ఉంటే బాగుండేది కదా? అని కచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే, జీఎస్టీ ప్రభావం టీవీలపై భారీగానే ఉంది కాబట్టి. వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చిన తరువాత ఎల్ఈడీలు, స్మార్ట్ ఎల్ఈడీలు, యూహెచ్డీ ఎల్ఈడీ ప్యానల్స్, సెట్లపై పన్ను పరిధి పెరిగింది. ఇక ఇండియాలో టీవీ ధరలను పెంచిన తొలి సంస్థగా ఎల్జీ నిలిచింది. అన్ని రకాల టీవీలపై 1.3 నుంచి 7 శాతం వరకూ ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. ఢిల్లీ, పశ్చిమ రాష్ట్రాల్లో మాత్రం ధరల పెరుగుదల 2 శాతానికి పరిమితం చేశామని సంస్థ సేల్స్ అండ్ మేనేజింగ్ అధికారి విజయ్ తెలిపారు. ఈ పెంపు భారం కస్టమర్లపై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నట్టు ఆయన అన్నారు.

కాగా, టీవీలతో పాటు ఫ్రిజ్ లు, మైక్రోవేవ్ ఓవెన్ ల ధరలను పెంచక తప్పడం లేదని పానసోనిక్ ప్రకటించింది. ఈ వారాంతంలోగా ఏ మేరకు ధరలను పెంచనున్నామన్న విషయాన్ని వెల్లడిస్తామని సంస్థ భారత సేల్స్ డైరెక్టర్ అజయ్ సేథ్ తెలిపారు. 3 నుంచి 4 శాతం వరకూ ధరలు పెరగవచ్చని ఆయన అన్నారు. ఇక మరో పెద్ద బ్రాండ్ శాంసంగ్ సైతం ఇదే దారిలో నడుస్తోంది. జీఎస్టీ ప్రభావం నుంచి మార్జిన్లను కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రొడక్టులపై 1 నుంచి 2 శాతం వరకూ ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. సోనీ సంస్థ మాత్రం, ఇప్పటికిప్పుడు ధరలను పెంచే ఆలోచనేదీ చేయడం లేదని, వస్తు సేవల పన్ను ప్రభావం తమపై ఎంతమాత్రం ఉంటుందో చూసిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

More Telugu News