: పోప్, అమెరికా అధ్యక్షుడి తరువాత అంతటి ఘనత మోదీకే... ఇజ్రాయిల్ పర్యటన షెడ్యూల్ ఇది!

ఇజ్రాయిల్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘనమైన స్వాగతం పలకాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ నిర్ణయించారు. ఇజ్రాయిల్ కు వచ్చే అతిథుల్లో పోప్, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ప్రధాని స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికారు. ఇప్పుడు తాజాగా అదే ఘనతను మోదీ అందుకోనున్నారు. మోదీకి స్వయంగా నెతన్యాహూ స్వాగతం పలకనున్నారు. ఆ తరువాత కింగ్ డేవిడ్ హోటల్ లో మోదీ బసచేస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఇదే హోటల్ లో గతంలో డొనాల్డ్ ట్రంప్ విడిది చేశారు. మోదీ పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని నెతన్యాహూ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అడుగడుగునా ఆయన వెంట ఉండి, వీలైనంత ఎక్కువ స్నేహబంధాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇరు దేశాలకూ లబ్దిని చేకూర్చే వివిధ అంశాలపై నెతన్యాహూ, మోదీల మధ్య చర్చలు సాగనున్నాయి. మోదీకి ప్రత్యేక విందును సైతం ఆయన ఏర్పాటు చేస్తున్నారు. రేపు జరిగే కమ్యూనిటీ రిసెప్షన్ లో సైతం మోదీ, నెతన్యాహూ కలసి పాల్గొంటారు. హైఫాలోని భారత సైనికుల స్మారక చిహ్నం వద్ద మోదీ నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత 26/11 ముంబై దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన హోల్ట్ బెర్గ్ మోషేను మోదీ కలుస్తారు. ఆపై భారత సంతతి ప్రజలతో మాట్లాడే మోదీ, జర్మనీలో జరిగే 12వ జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు హాంబర్గ్ కు బయలుదేరి వెళతారు.

More Telugu News