: అమిత్ షాపై కేసు పెట్టండి: డీజీపీ, సీఎస్, విమానయాన శాఖలను డిమాండ్ చేసిన హక్కుల కార్యకర్త

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై కేసు నమోదు చేయాలని గోవాకు చెందిన హక్కుల కార్యకర్త ఎయిరెస్ రోడ్రిగ్స్ అనే వ్యక్తి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, విమానయాన శాఖలను కోరారు. ఘటన వివరాల్లోకి వెళ్తే... అమిత్ షా ఇటీవల గోవాకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. విమానాశ్రయంలో సమావేశం నిర్వహించడం నిబంధనలు అతిక్రమించడమేనని, ఇతరులు చేస్తే అలా అనుమతిస్తారా? అనుమతి లేకుండా అమిత్ షా విమానాశ్రయంలో ఎలా సమావేశం నిర్వహించారని ప్రశ్నిస్తూ, ఆయనపై కేసు నమోదు చేయాలని ఆయన డీజీపీ, సీఎస్, విమానయాన శాఖలను డిమాండ్ చేశారు.

 దీనిపై గోవా కాంగ్రెస్‌ స్పందించింది. అమిత్ షాను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై విమానాశ్రయ డైరెక్టర్ ను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడంతో తాను అనుమతినివ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే బీజేపీ మాత్రం తాము విమానాశ్రయం లోపల సమావేశం నిర్వహించలేదని, ఎయిర్ పోర్టు బయటే సమావేశం నిర్వహించామని చెబుతోంది. అంతే కాకుండా తమ సమావేశం కేవలం ఏడు నిమిషాల్లోనే ముగిసిపోయిందని, దీని వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పింది. అమిత్ షా సమావేశంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌ లు కూడా పాల్గొనడం విశేషం. 

More Telugu News