: జీఎస్టీతో రాష్ట్రానికి నష్టం లేదు... లాభమే!: సీఎం కేసీఆర్

వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)తో రాష్ట్రానికి లాభమే కానీ, నష్టమేమీ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలు వల్ల కలిగే ప్రభావాలపై ఆయా శాఖ ఉన్నతాధికారులతో ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఏడాదికి రెండు, మూడు వేల కోట్ల అదనపు ఆదాయం రాష్ట్రానికి లభిస్తుందని అన్నారు. రూ.20 లక్షల లోపు వార్షిక టర్నోవర్ గల వ్యాపారులకు పన్ను ఉండదని, రూ.20 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు టర్నోవర్ ఉన్న వారికి ఒక్క శాతం పన్నుగా జీఎస్టీ అమలు చేయాలన్నది కేంద్రం నిర్ణయమని అన్నారు.

 జీఎస్టీలో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని, జీఎస్టీపై ప్రజల్లో భయాలను తొలగించాలని, జీఎస్టీపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలని, అవగాహనా సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా సూచించారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో 91 వాణిజ్యపన్నుల సర్కిళ్లలో సదస్సులు నిర్వహించాలని ఉన్నతాధికారులకు  నిర్దేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి, కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు కూడా స్వయంగా వ్యాపారుల వద్దకు వెళ్లి జీఎస్టీపై వారికి ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

More Telugu News