: పోలీసులు వ‌స్తున్నార‌ని.. ఈ దొంగ ఎలా దాక్కున్నాడో చూడండి!

ఇళ్ల‌లోకి దూరి చోరీల‌కు పాల్ప‌డే దొంగ‌లు ఎంతో తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఒకవేళ పోలీసులు తమ వ‌ద్ద‌కు వ‌స్తే వారి నుంచి ఎలా త‌ప్పించుకోవాల‌నే ప్లాన్ వేసుకుని ఓ క్లారిటీతో ఉంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలో మాత్రం దొంగ‌ చాలా సునాయాసంగా పోలీసులకు దొరికిపోయాడు. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్లు పోలీసులు ఆ ఇంట్లోకి రాగానే ఆ దొంగ కాళ్లు క‌నిపించాయి. దాంతో ఈజీగా పట్టేశారు. ఆ దొంగను తాము ఎప్పటినుంచో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. చివరకు ఎంతో సునాయాసంగా దొరికాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఇటీవ‌ల పోలీసులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

తనను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న స‌ద‌రు దొంగ ఓ బ‌ల్ల కింద‌కు దూరాడు. అయితే, అక్కడే తప్పు చేశాడు . తన రెండు కాళ్లు బయటికి కనిపించేలా దాక్కున్నాడు. ఇక త‌న‌ను ఎవ‌రూ చూడ‌లేర‌ని అనుకున్నాడేమో! ఇంట్లోకి ప్ర‌వేశించ‌గానే అత‌డి కాళ్లను చూసిన పోలీసులు ఆ దొంగ తెలివితేట‌లకు న‌వ్వుకున్నారు. ముఖం మాత్ర‌మే బ‌ల్ల‌కింద‌కు దూర్చి కాళ్లు క‌నిపించేలా దాక్కున్న ఈ దొంగ ఫొటోను చూసి నెటిజ‌న్లు న‌వ్వుకుంటున్నారు. యూకేలోని వెస్ట్‌ యార్క్‌షైర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

More Telugu News