: రూ.40 కోసం మూడేళ్లు పోరాడి విజయం సాధించిన 70 ఏళ్ల వృద్ధుడు!

ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో 40 రూపాయల కోసం 70 ఏళ్ల వృద్ధుడు మూడేళ్లపాటు పోరాడి విజయం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన లెఖ్ రాజ్ తనకు 40 రూపాయల పెనాల్టీ విధించడాన్ని సవాలు చేస్తూ నేషనల్ కన్జుమర్ డిస్ప్యూట్స్ రిడ్రెస్సల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ని ఆశ్రయించి ఎట్టకేలకు విజయం సాధించాడు.

హిమాచల్ ప్రదేశ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌పీహెచ్‌యూడీఏ) లెఖ్ రాజ్‌కు ఓ ఇంటిని కేటాయించింది. అయితే ఆ ఇంటి నిర్వహణ ఖర్చులను చెల్లించనందుకు గాను హెచ్‌పీహెచ్‌యూడీఏ రూ.40 జరిమానా విధించింది. ప్రతి నెలా చెల్లించాల్సిన రూ.808 బదులు నిర్వహణ ఖర్చులు చెల్లించనందుకు గాను పెనాల్టీ కింద అదనంగా మరో రూ.40 వేసి రూ.848 చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు జరిమానా చెల్లించకుంటే నీరు తదితర ప్రాథమిక అవసరాలను తొలగిస్తామని హెచ్చరించింది.

దీంతో తనకు రూ.40 పెనాల్టీ విధించడం అన్యాయమంటూ లెఖ్ రాజ్ 2014లో జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. 2016లో దానిని కోర్టు కొట్టివేసింది. దీంతో రాష్ట్ర వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. అక్కడ కూడా అతడికి నిరాశే ఎదురైంది. చివరికి ఎన్‌సీడీఆర్‌సీని ఆశ్రయించాడు. లెఖ్ రాజ్‌ నుంచి రూ.808 బదులు రూ.848 ఎందుకు వసూలు చేసిందీ నిరూపించడంలో హెచ్‌పీహెచ్‌యూడీఏ విఫలమైంది. దీంతో లెఖ్ రాజ్‌కు రూ.40 తిరిగి చెల్లించడంతోపాటు పరిహారం కింద అదనంగా మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది. తన మూడేళ్ల  పోరాటానికి లభించిన విజయం ఇదని లెఖ్ రాజ్ ఆనందం వ్యక్తం చేశారు.

More Telugu News