: జీఎస్టీ వచ్చింది... తలా రూ. 20 తీయండి: సోషల్ మీడియాకెక్కిన రైల్వే టీటీఈ నిర్వాకం

అది గుజరాత్ క్వీన్ ఎక్స్ ప్రెస్. అహ్మదాబాద్, సూరత్ నడుమ తిరుగుతుంటుంది. ఈ రైల్లో టికెట్లను తనిఖీ చేస్తున్న ఓ టీటీఈ... సరిగ్గా సమయం చూసుకుని తలా రూ. 20 అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తే, జీఎస్టీ అమల్లోకి వచ్చిందని, రైల్వే శాఖ టికెట్ రేట్లను మార్చినందున, అదనంగా ఒక్కొక్కరూ 20 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కొందరు ఆ డబ్బు చెల్లించగా, మరికొందరు రసీదును అడిగారు. ఇంకొందరు ఇవ్వడానికి నిరాకరించారు.

మరికొందరు ఏకంగా ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఘటన వైరల్ గా మారింది. వాస్తవానికి జీఎస్టీ అమలు మొదలైనా, జూలై 1కి ముందు రిజర్వేషన్ చేయించుకున్న రైలు టికెట్లపై ఎలాంటి అదనపు భారమూ ఉండదు. దీనిపై చార్జీలు చెల్లించాల్సిన అవసరమూ లేదు. జూలై 1 తరువాత బుక్ చేసుకునే టికెట్లు మాత్రమే జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. ఈ విషయంలో రైల్వే శాఖ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, టీటీఈ చర్య రైల్వేల పరువును తీసేలా ఉండటం వివాదాస్పదమైంది.

More Telugu News