: ఈ ఆదివారం రసవత్తరం.. దాయాదితో పోరుకు సిద్ధమైన టీమిండియా మహిళా జట్టు!

ఇటీవల ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. అయితే ఈసారి దాయాది పాక్‌తో పోరుకు సిద్ధమైంది టీమిండియా మహిళల జట్టు. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా నేడు పాక్‌తో భారత్ తలపడనుంది. డెర్బీలోని కౌంటీ గ్రౌండ్‌ ఇందుకు వేదిక కానుంది. ఆట ఏదైనా ప్రత్యర్థి పాక్ అయితే ఆ పోరు రసవత్తరంగా ఉంటుందని నమ్ముతున్న అభిమానులు మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నారు. కాగా, అన్ని రంగాల్లోనూ బలంగా ఉన్న పాక్‌ను ఎదుర్కోవడం కష్టమే అయినప్పటికీ ఎదురొడ్డేందుకు మిథాలీ సేన సమాయత్తమవుతోంది. ఫీల్డింగ్‌లోని లోపాలను సరిదిద్దుకునేందుకు శనివారం మొత్తం ప్రాక్టీస్ చేసింది. ఇప్పటికే ఇంగ్లండ్, విండీస్‌పై వరుస విజయాలు సాధించిన టీమిండియా పూర్తి విశ్వాసంతో ఉంది.

ఓపెనర్ స్మృతి మందన సూపర్ ఫామ్‌లో కొనసాగుతుండడం భారత్‌కు కలిసి వచ్చే అంశం. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 90 పరుగులు చేసి తృటితో శతకాన్ని కోల్పోయిన స్మృతి విండీస్‌తో మ్యాచ్‌లో అజేయంగా 106 పరుగులు చేసింది. రెండు మ్యాచుల్లోనూ మ్యాన్ ఆఫ్ ద ప్లేయర్ అవార్డులు అందుకుంది. అదే ఊపును నేటి మ్యాచ్‌లోనూ స్మృతి కొనసాగిస్తే భారత్‌కు ఇక తిరుగుండదు. మరోవైపు ఇప్పటికే గాయాలబారిన పడి విలవిల్లాడుతున్న పాక్ జట్టుకు కీలక మ్యాచ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. చేతి గాయం కారణంగా పాక్ వైస్ కెప్టెన్ మ్యాచ్‌కు దూరమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో గెలవడమే తమ లక్ష్యమని, సెమీస్‌కు చేరడమే ధ్యేయంగా పోరాడతామని టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది.

More Telugu News