: జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది... ఇప్పుడేమనుకొని ఏం లాభం?: తమ్ముడి మరణంపై హీరో రవితేజ

తన తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో మరణించిన వేళ, కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదన్న నిందను మోయాల్సి రావడం తనకెంతో బాధను కలిగించిందని హీరో రవితేజ వ్యాఖ్యానించాడు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తనకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ఇప్పుడు చెప్పేందుకు ఏమీ లేదని ఆయన అన్నాడు. తాము ఏ పరిస్థితిలో ఉన్నామో కూడా చూడకుండా, సామాజిక మాధ్యమాల్లో హిట్స్ కోసం రాద్ధాంతం చేశారని, ఎంతమాత్రమూ ఆలోచించకుండా నిందలు వేశారని అన్నాడు. ఆరోజు తన తండ్రి, తల్లి కుప్పకూలిపోయారని, వారు ఇప్పటికీ సాధారణ స్థితికి రాలేదని చెప్పుకొచ్చాడు. వారెక్కడ దూరమవుతారోనన్న ఆలోచన, ఛిద్రమైన భరత్ ముఖం చూడలేకే తాము వెళ్లలేదని మరోసారి స్పష్టం చేశాడు.

 తమ్ముడి కర్మకాండలు అపరిచితులతో చేయించలేదని, తన తల్లి సోదరి భర్తతోనే చేయించామని, ఆయన ఎవరో తెలుసుకోకుండానే, భరత్ ను అనాధను చేశామని చెబుతూ తన కుటుంబాన్ని అవమానించారని వాపోయాడు. ఇక భరత్ మరణించిన రోజు షూటింగ్ లో ఎంతో మంది డేట్స్ ఉన్నాయని, ఇది కోట్ల వ్యాపారమని, ఒక్కరోజు తేడా జరిగినా నిర్మాత నష్టపోతాడన్న ఆలోచనతోనే బాధను మనసులోనే దిగమింగుకుని షూటింగ్ కు వెళ్లానని, దానిపైనా తనను ఎంతో మంది విమర్శించారని అన్నాడు. భరత్ పుట్టిన రోజున కలిశామని, ఆ రోజు మాట్లాడిన మాటలే ఆఖరు అయ్యాయని, ఔటర్ పై తన తమ్ముడి ప్రాణాల కోసమే లారీ బ్రేక్ డౌన్ అయినట్టు ఉందని తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు.

More Telugu News