: సర్జికల్ స్ట్రైక్స్ కి కారణం ఆ యాంకర్ అడిగిన ప్రశ్నే!: మనోహర్ పారికర్

దేశం మొత్తం జీఎస్టీ గురించి మాట్లాడుతున్న వేళ...వివిధ రంగాలకు చెందినవారు ఆందోళనలతో హోరెత్తిస్తున్నవేళ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సర్జికల్ స్ట్రైక్స్ అస్త్రాన్ని బయటకు తీశారు. పనాజీలో పారిశ్రామిక వేత్తలతో జరుగుతున్న సమావేశంలో ఆయన చెబుతూ, సర్జికల్ స్ట్రైక్స్ కు ఒక టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నే కారణమని చెప్పి అందర్నీ నోరెళ్లబెట్టేలా చేశారు. 2015 జూన్ 4న మ‌య‌న్మార్ బోర్డ‌ర్ లో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ పై మిలిటెంట్లు ఆక‌స్మిక దాడి చేసి 18 మంది భార‌త జ‌వాన్లను హతమార్చారని ఆయన గుర్తు చేశారు. అనంతరం విరుచుకుపడ్డ ఇండియన్ ఆర్మీ సుమారు 80 మంది మిలిటెంట్లను రహస్యంగా హ‌త‌మార్చిందని ఆయన చెప్పారు. ఇది ఇండియన్ ఆర్మీ చేసిన తొలి సర్జికల్ స్ట్రైక్ అని ఆయన అన్నారు.

ఆ సందర్భంగా ఆనాడు కేంద్ర మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్ సింగ్ రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ మ‌య‌న్మార్ బోర్డ‌ర్ ద‌గ్గ‌ర జ‌రుగుతున్న ఆప‌రేష‌న్ గురించి వివ‌రిస్తుండగా, ఒక టీవీ ఛానెల్ కు చెందిన యాంక‌ర్ ఇలాంటి దాడే ప‌శ్చిమ స‌రిహ‌ద్దు ద‌గ్గ‌ర చేయ‌గ‌ల‌రా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారని ఆయన తెలిపారు. ఈ ఇంటర్వ్యూను చూసిన తాను ఆ ప్రశ్నను అవమానంగా భావించానని ఆయన చెప్పారు. దీంతో అంతర్మథనంలో పడిపోయానని, సుమారు 15 నెలలపాటు శ్రమించి సర్జికల్ స్ట్రైక్స్ కు పూనుకున్నామని ఆయన చెప్పారు. ఈ దాడి కోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశామని, ప్రత్యేక ఆయుధాలు సమకూర్చామని, పాక్ ఆర్మీ ఫైరింగ్ యూనిట్లను గుర్తించేందుకు డీఆర్డీవో రూపొందించిన స్వాతి వెపన్ రాడార్లు వినియోగించామని అన్నారు. అనంతరం 2016 సెప్టెంబర్ 29న ఎల్వోసీ వద్ద సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఆయన చెప్పారు. స్వాతి రాడార్ ల వల్లే 40 పాక్ ఫైరింగ్ యూనిట్లు ధ్వంసం చేశామని చెప్పారు.

More Telugu News