: వైఫల్యాలను సరిదిద్దుకోకుంటే కఠిన చర్యలే!: అధికారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పై ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో చేసిన వైఫల్యాలను సరిదిద్దుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన, ఏజన్సీలో అంటు వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు. తాను అశ్రద్ధను ఎంతమాత్రమూ సహించబోనని, ఈ విషయంలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం స్థానిక సంస్థల ప్రధాన బాధ్యతేనని అన్నారు. ఏజన్సీ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. రేపటి నుంచి 'దోమలపై దండయాత్ర' కార్యక్రమంలో ప్రతి అధికారీ ఉత్సాహంగా పాల్గొనాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు హాజరుకాగా, చంద్రబాబు మాట్లాడుతూ, సమాచార లోపంతోనే చాపరాయి, గరగపర్రు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇవి ప్రభుత్వానికి తలవంపులుగా మారాయని అన్నారు. ఎప్పుడు, ఎక్కడ ఏం జరిగినా సత్వరమే సమాచారం అందేలా సమాచార వ్యవస్థ మెరుగుపడాలని, అధికారులు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

More Telugu News