: రూ. 4 కోట్ల బీమా సొమ్ము కోసం బాలీవుడ్ సినిమాలను తలదన్నే స్క్రిప్ట్... అయినా అడ్డంగా దొరికిపోయాడు!

తన పేరిట ఉన్న ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం బాలీవుడ్ సినిమాలను తలదన్నేలా స్క్రిప్ట్ రాసుకుని, ఆ డబ్బును పొందినప్పటికీ అడ్డంగా దొరికిపోయాడో ప్రబుద్ధుడు. ఓ వ్యక్తిని హత్య చేసి, అతన్ని తానేనని నమ్మించడం వరకూ విజయం సాధించిన అతను, ఆపై పోలీసుల ఎంక్వైరీలో మాత్రం దొరికిపోయాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నాసిక్ సమీపంలో నివసించే రామ్ దాస్ వాఘా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్. అతని పేరిట మూడు బీమా కంపెనీల నుంచి రూ. 4 కోట్ల బీమా ఉంది. ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని మరో ముగ్గురి సాయంతో ఓ ప్లాన్ వేశాడు.

కట్ చేస్తే... ఈ నెల 9వ తేదీన త్రయంబకేశ్వర్ సమీపంలో ఓ రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. వాహనం చక్రాలు తలపై నుంచి వెళ్లడంతో గుర్తుపట్టలేని విధంగా శరీరం మారిపోయింది. అతని వద్ద లభించిన ఏటీఎం కార్డు, ఓ ఎలక్ట్రిసిటీ బిల్లు తదితరాలు అతను రామ్ దాస్ వాఘాగా నిరూపిస్తుండటంతో, పోలీసులు సమాచారాన్ని అతని కుటుంబానికి తెలిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆపై వారు బీమా కంపెనీలకు విషయం తెలిపి, ఆ డబ్బు తీసుకున్నారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో అది రోడ్డు ప్రమాదం కాదని, హత్య చేసి వాహనంతో తొక్కించారని తేలడంతో, పోలీసులు కేసును మూసివేయకుండా విచారణ ప్రారంభించారు.

ఈ క్రమంలో అతని బంధువులను, స్నేహితులను విచారిస్తుంటే, విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. వాఘా బతికే ఉన్నాడన్న సమాచారం తెలిసింది. ఆపై మృతదేహం ముబారక్ చాంద్ పాషా అనే ఏపీ లేదా తమిళనాడుకు చెందిన వ్యక్తిదని, అతను ఓ రెస్టారెంటులో పని చేస్తున్నాడని, అతనిని హత్య చేసి ఈ డ్రామా ఆడారని పోలీసులు గుర్తించారు. వాఘాకు సహకరించిన మిగతా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంకా వాఘా దొరకలేదు. అతను క్లయిమ్ చేసుకున్న డబ్బు కూడా ఇంకా రికవరీ కాలేదు. కేసును విచారిస్తున్నామని, త్వరలోనే వాఘాను పట్టుకుంటామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News