: తీవ్ర గందరగోళం, ఎన్నో ఆశల నడుమ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న అతిపెద్ద ఆర్ధిక సంస్కరణ!

తీవ్ర గందరగోళం... ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆశల నడుమ భారత దేశంలో మరికొన్ని గంటల్లో అతిపెద్ద సంస్కరణ అమలులోకి రానుంది. నేటి అర్థరాత్రి 12 గంటల నుంచి జీఎస్టీ బిల్లు ఆచరణలోకి రానుంది. అయితే, జీఎస్టీ వల్ల ఏం జరుగుతుందో చాలా మందికి తెలియడం లేదు. జీఎస్టీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో ఈ సరికొత్త ఆర్ధిక సంస్కరణను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురానుంది. గతంలో ప్రతిపక్షంలో వుండగా జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ, ఇప్పుడు మెజారిటీ పార్లమెంటు ఆమోదంతో జీఎస్టీని అమలులోకి తీసుకువస్తోంది.

ఈ నేపథ్యంలో జీఎస్టీ కారణంగా వినియోగ వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి? వేటి ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి? పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి ఎందుకు తీసుకురాలేదు? అలా తెస్తే కచ్చితంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గేవి కదా? పన్ను సంస్కరణల ప్రభావం పేరుతో వ్యాపారులు తమపై భారం వేస్తారా? జీఎస్టీ వల్ల ప్రభుత్వాలు చెబుతున్నట్టు లాభమా? నష్టమా? ఇప్పుడు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవాలా? పన్నులు ఎలా చెల్లించాలి? వంటి ఎన్నో అనుమానాలు ప్రజలముందున్నాయి.

అయితే జీఎస్టీపై ఒకేసారి ఒక అభిప్రాయానికి రావడం సరైనది కాదని, దీర్ఘకాల ప్రయోజనాలు మాత్రం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు పన్నులు విధించే అధికారం పూర్తిగా కోల్పోనున్నాయి. అయితే జీఎస్టీతో నష్టం వస్తే ఐదేళ్లు కేంద్రం భర్తీ చేస్తుంది. ఈ ఐదేళ్లలో వనరులను రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవాల్సి ఉంటుంది. గతంలో వస్తువును బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అన్ని రకాల పన్నులు కలిపి 42 శాతం వరకు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు నాలుగు శ్లాబుల్లో గరిష్టంగా 28 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. దీనివల్ల ధరలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

More Telugu News