: పౌరులైనా సరే.. తుపాకులతో కనిపిస్తే కాల్చి పారేయండి.. భద్రతా దళాలను ఆదేశించిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులైనా సరే తుపాకులతో కనిపిస్తే కాల్చి పారేయాలని ఆదేశించారు. పొరపాటున పౌరులను చంపేసినా చట్టబద్ధంగా వారికి ఎటువంటి సమస్యలు రాకుండా తాను చూసుకుంటానని అభయమిచ్చారు. దేశంలోని దక్షిణ ప్రాంతమైన మరావిలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మే 23న మరావీ నగరంపై ఐఎస్ ఉగ్రవాదులు దాడికి దిగారు. వారితో జరుగుతున్న పోరులో ఇప్పటి వరకు 400 మందికి పైగా మృతి చెందారు. వీరిలో పౌరులు కూడా ఉన్నారు. బుధవారం సైన్యం దాడిలో మృతి చెందిన మరో 17 మంది పౌరుల మృతదేహాలను గుర్తించిన ప్రభుత్వ దళాలు మరావిని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

ఈ సందర్భంగా అధ్యక్షుడు డ్యుటెర్టీ మాట్లాడుతూ భద్రతా దళాలకు పూర్తి అండగా నిలిచారు. మిలిటెంట్లతో పోరాడుతున్న సమయంలో అక్కడ పౌరులు ఉన్నారని సంశయించాల్సిన పనిలేదని, కాల్చి పడేయాలని ఆదేశించారు. పౌరులను చంపడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్న ఆయన, పౌరులు అక్కడి నుంచి పారిపోవడం కానీ, దాక్కోవడం కానీ చేయాలని, అది వారి విధి అని పేర్కొన్నారు.  కాగా, ప్రభుత్వ దళాలకు, ఐఎస్ ఉగ్రవాదులకు జరుగుతున్న పోరులో ఇప్పటి వరకు 44 మంది పౌరులు మృతి చెందారు. మరావి, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 4 లక్షల మంది ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. 299 మంది ఉగ్రవాదులు, 71 మంది జవాన్లు, పోలీసులు మృతి చెందారు.

More Telugu News