: భారత్-చైనా సరిహద్దులో టెన్షన్, టెన్షన్.. 3 వేల చొప్పున బలగాల మోహరింపు.. దశాబ్దాల తర్వాత తొలిసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు!

దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కిం-భూటాన్-టిబెట్ త్రి కూడలి (ట్రై జంక్షన్) వద్ద భారత్, చైనా బలగాలు పరస్పరం పెద్ద ఎత్తున మోహరించాయి. ఇరు దేశాలు దాదాపు 3 వేల చొప్పున బలగాలను సరిహద్దులో మోహరించినట్టు తెలుస్తోంది.

ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం గ్యాంగ్‌టక్‌లోని 17 మౌంటైన్ డివిజన్, కలింపోంగ్‌లోని 27 మౌంటైన్ డివిజన్‌లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రత్యర్థులిద్దరూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించి సెక్యూరిటీని పటిష్టం చేసినట్టు సమాచారం. తాజా పరిణామాలపై స్పందించేందుకు ఇండియన్ ఆర్మీ నిరాకరించింది. గతంలోనూ దళాలను మోహరించినా ప్రస్తుత పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది.

‘‘ప్రస్తుతం తమ దళాలను ఉపసంహరించేందుకు రెండు దేశాలు సిద్ధంగా లేవు. ఇరు దేశాల కమాండర్ల మధ్య ఫ్లాగ్ మీటింగులు, ఇతర చర్చలు ఇప్పటి వరకు జరగలేదు’’ అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. భూటాన్ భూభాగమైన డోక్లం దిశగా త్రి కూడలి వరకు చైనా రోడ్డును నిర్మిస్తుండడాన్ని భూటాన్ సహా భారత్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ 40 టన్నుల బరువును తట్టుకునేలా చైనా ‘క్లాస్-40’ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీని ద్వారా యుద్ధ ట్యాంకులు, ఇతర యుద్ధ సామగ్రిని తరలించాలనేది చైనా లక్ష్యం.

More Telugu News