: ‘ఎయిర్ ఇండియా’పై అంత ధైర్యం చేయలేను: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా

తన విమానాలు ఆలస్యంగా నడుస్తాయన్న అపకీర్తితో పాటు, ఇటీవలి కాలంలో పలు వివాదాలను కూడా ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మూటగట్టుకుంటోంది. దీనికి తోడు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, సంస్థకు సంబంధించి ఎంత వాటా విక్రయించాలి? అప్పులు, మొదలైన అంశాలపై ఎయిర్ ఇండియా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది.

ఈ క్రమంలో, ఎయిర్ లైన్ వాటాలను విక్రయిస్తే.. వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను రాహుల్ సూద్ అనే ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ప్రశ్న వేశాడు. ‘సార్, మహీంద్రా గ్రూప్ ఎయిరిండియాపై పెట్టుబడులు పెట్టనుందా? భారత విమానయాన రంగంలోకి కొత్త విమానాలను తీసుకురానుందా?’ అని ప్రశ్నించాడు.

ఇందుకు ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ‘సాధారణంగా నేను ధైర్యవంతుడిని. అయితే, ఎయిర్ ఇండియా విషయంలో అంత ధైర్యం చేయలేను’ అని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఎయిర్ ఇండియాను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చక మునుపు దానిని టాటా గ్రూప్ నిర్వహించింది. ఎయిర్ ఇండియా వాటాలు టాటాయే కొనుగోలు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై సదరు సంస్థ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

More Telugu News