: ’కిదాంబి‘కి చంద్రబాబు సన్మానం.. నజరానాగా రూ.50 లక్షలు, గ్రూప్-1 ఉద్యోగం, ఇంటిస్థలం!

ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ విజేత, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కు నజరానాగా రూ.50 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే, శ్రీకాంత్ కు గ్రూప్-1 ఉద్యోగం,1000 గజాల స్థలం ఇస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. కోచ్ పుల్లెల గోపీచంద్ కూ రూ.15 లక్షలు నజరానాగా ఇస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో కిదాంబి శ్రీకాంత్ కు ఏర్పాటు చేసిన సన్మాన సభలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ రోజు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి..మంచి కేడర్ ఉంటుంది. అదే సమయంలో బాగా ఆడుకుంటే ఆరోగ్యం ఉంటుంది..జీవితంలో కూడా సెటిల్ అవుతారు. ప్రభుత్వాలు కూడా గుర్తిస్తాయి. గ్రూప్-1 ఉద్యోగాలు ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ, ఆంధ్రా రాష్ట్ర ప్రతిష్ట పెంచినప్పుడు, అలాంటి వ్యక్తులను గౌరవించడానికి గ్రూప్-1 ఉద్యోగమే సరైందని భావించి శ్రీకాంత్ కు ఈ ఆఫర్ ఇచ్చాను. శ్రీకాంత్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఏపీ తరపున శ్రీకాంత్ ఆడతారు. స్పోర్ట్స్ అనేది జీవితంలో భాగం కావాలి. దినానికో గంట మన వ్యక్తిగత ఆరోగ్యం కోసం పనిచేయాలి. ఆ ఆరోగ్యం ఉండాలంటే స్పోర్ట్స్ లో భాగస్వామ్యం కావడం కానీ, ఎక్సర్ సైజ్ లు చేయడం కానీ చేయాలి’ అని చంద్రబాబు సూచించారు. అంతకుముందు, చంద్రబాబుకు షటిల్ బ్యాట్ ను శ్రీకాంత్ బహూకరించాడు. అంతకుముందు, శ్రీకాంత్ తో సరదాగా కాసేపు చంద్రబాబు షటిల్ ఆడారు. 

More Telugu News