: యూఎస్ విమానాశ్రయాల్లో ఇండియన్స్ ఇక 'లో రిస్క్ ట్రావెలర్స్'... సులువుగా దేశంలోకి ఎంట్రీ

తరచూ అమెరికాకు వెళ్లే భారతీయులు ఇకపై మరింత వేగంగా తమ ఇమిగ్రేషన్ ను పూర్తి చేసుకుని విమానాశ్రయం దాటి బయటకు వెళ్లవచ్చు. ఈ మేరకు గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ లో భారత్ ను చేరుస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇప్పటివరకూ స్విట్జర్లాండ్, యూకే పౌరులకు మాత్రమే అమెరికా ఈ సదుపాయాన్ని కల్పిస్తుండగా, ఇకపై భారతీయులు కూడా 'లో రిస్క్ ట్రావెలర్స్' జాబితాలో చేరిపోనున్నారు. వ్యాపార, విద్యా రంగంలో రెండు దేశాల మధ్యా ఉన్న సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా, యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ కార్యక్రమంలో భాగంగా ఈ 'గ్లోబల్ ఎంట్రీ' ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అమెరికన్ గడ్డపై కాలుమోపే ఎంపిక చేసిన దేశాల విదేశీ పౌరులకు ముందస్తు అనుమతులు ఇవ్వడం, త్వరగా ఇమిగ్రేషన్ పూర్తి చేసి బయటకు అనుమతించడం వంటివి ఉంటాయి. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో ఈ దేశాల పౌరులు ఇమిగ్రేషన్ క్యూల్లో నిలబడి అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం కోసం వేచి చూడకుండా ఆటోమేటిక్ కియాస్క్ ల ద్వారానూ క్లియరెన్స్ తీసుకోవచ్చు.

 ఈ కియాస్క్ ల వద్ద మెషిన్ చదవగలిగే పాస్ పోర్టులు, యూఎస్ శాశ్వత నివాస కార్డు, ఫింగర్ ప్రింట్ లను వెరిఫికేషన్ కోసం చూపి కస్టమ్స్ క్లియరెన్స్ పొందవచ్చు. ఆపై ఇదే కియాస్క్, బ్యాగేజ్ క్లయిమ్, ఎగ్జిట్ పాస్ లను అందిస్తుంది. అయితే, ప్రయాణికులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. వారిని ఒకసారి పరిశీలించి, ఇంటర్వ్యూ చేసిన తరువాత వివరాలు సర్వర్లలో ఉంచుతారు. ఆపైనే అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఇమిగ్రేషన్ సులువవుతుంది.

More Telugu News