: శిరీష ఆత్మహత్య కేసు పోలీసు విచారణ ముగిసింది...ఫోరెన్సిక్ నివేదికే కీలకం...ఫైల్ క్లోజా?

హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో  విచారణ ముగిసిందా? అంటే అవుననే పోలీసుల నుంచి సమాధానం వినిపిస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలో శిరీషపై అత్యాచారం జరిగిందని తేలితే తప్ప ఈ కేసు ఫైల్ ను పోలీసులు మూసేసినట్టేనని తెలుస్తోంది. కోర్టులో  విచారణ సమయంలో పోలీసులు దర్యాప్తు వివరాలు న్యాయమూర్తికి నివేదిస్తారు. ఇప్పటికే ఈ కేసులో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు.

రాజీవ్, శ్రవణ్ లను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు, విచారణను తూతూ మంత్రంగా ముగించారని శిరీష పిన్ని ఆరోపించారు. కేసు రీ కన్ స్ట్రక్షన్ పేరుతో కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తిప్పిన పోలీసులు కనీసం క్వార్టర్స్ వరకు కూడా వెళ్లలేదంటే కేసుపై ఎంత శ్రద్ధచూపించారో తెలుసుకోవచ్చని ఆమె విమర్శించారు. ఈ కేసులో తమ అనుమానాలేవీ తీరలేదు సరికదా, మరింత బలపడ్డాయని ఆమె తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఎలా వస్తుందో చూడాలని, అంతవరకు పోలీసులు చెబుతున్నదే వినాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. మరోవైపు రెండు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం కేసు దర్యాప్తులో పురోగతి సాధించారా? లేదా? అన్న విషయాలేవీ చెప్పకుండానే, రాజీవ్, శ్రవణ్ లకు వైద్యపరీక్షలు నిర్వహించి, నాంపల్లి కోర్టులో సరెండర్ చేశారు. దీంతో ఈ కేసు ఫైల్ ఇంచుమించు క్లోజ్ అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News