: విజయవాడ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది: వీవీఎస్ లక్ష్మణ్ సతీమణి రాఘవా శైలజ

విజయవాడ వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందని, పాత రోజులు గుర్తుకొస్తాయని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సతీమణి రాఘవాశైలజ అన్నారు. విజయవాడలో ఓ న్యూస్ ఛానెల్ తో రాఘవా శైలజ మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. తనకు ఆంధ్రప్రదేశ్ అంతా తెలిసిందేనని, విజయవాడ, విశాఖపట్టణం, కడప, కర్నూలు, ఒంగోలులో తాను చదువుకున్నానని చెప్పారు. విజయవాడ నలంద కళాశాలలో ఇంటర్మీడియెట్, సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ సెకండియర్ వరకు చదివానని, ఆ తర్వాత కాకినాడలో డిగ్రీ పూర్తి చేసినట్టు చెప్పారు.

అప్పట్లో విజయవాడలో ఎగ్జిబిషన్ కు తప్పకుండా వెళ్లేవాళ్లమని, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి గుహలకు వెళ్లే వాళ్లమని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, విజయవాడలో తమ కుటుంబం నివసించిన రోజుల్లో కనకదుర్గమ్మ గుడికి వెళ్లే వాళ్లమని, కృష్ణా పుష్కరాలకు అమ్మతో కలిసి స్నానానికి వెళ్లే దాన్నని ఆమె చెప్పుకొచ్చారు. వీవీఎస్ లక్ష్మణ్ తో తన పెళ్లి కుదిరాక, మొట్టమొదటి శుభలేఖను కనకదుర్గమ్మ వారి పాదాల దగ్గర పెట్టామని చెప్పిన రాఘవా శైలజ, విజయవాడ వచ్చిన ప్రతిసారి కనకదుర్గమ్మతో పాటు లబ్బీపేట వేంకటేశ్వరస్వామి, మంగళగిరి పానకాలస్వామిని తప్పకుండా దర్శించుకుంటామని చెప్పారు.

కాగా, విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఎక్స్ లెన్సీ’ అవార్డు అందుకునే నిమిత్తం వీవీఎస్ లక్ష్మణ్ తన భార్య రాఘవా లక్ష్మణ్, కూతురు అచింత్య, కుమారుడు సర్వజిత్ తో కలిసి అక్కడికి వచ్చారు.

More Telugu News