: పాటపాడితే తెలుగు వాడు పాడినట్టు ఉండకూడదంటారు...అందుకే చాలా పాటలు వదులుకున్నాను: సింగర్ కారుణ్య

తెలుగును ఖూనీ చేస్తూ పాడమన్న మ్యూజిక్ డైరెక్టర్లకు నో చెప్పానని సింగర్ కారుణ్య తెలిపాడు. ఇండియన్ ఐడల్ టైటిల్ ను పబ్లిక్ ఓటింగ్ వల్ల త్రుటిలో పోగొట్టుకున్న కారుణ్య ప్లేబాక్ సింగర్ గా బాలీవుడ్, టాలీవుడ్ లో పేరొందాడు. అలాంటి కారుణ్య ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, పాట పాడితే తెలుగువాడు పాడినట్టు ఉండకూడదని మ్యూజిక్ డైరెక్టర్లు చెబుతుంటారని, అలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పాడు.

మరికొందరైతే ఆయా పదాల్లో లేని ఒత్తులను పలకాలని, ఉన్న ఒత్తులను పలకకూడదని చెబుతుంటారని, అలాంటప్పుడు సింగర్ గా కంటే తెలుగువాడిగా బాధపడతానని, వెంటనే పాటనుంచి తప్పుకుంటానని కారుణ్య తెలిపాడు. ఒక తెలుగు వాడిగా తెలుగును తన కళ్లముందే ఖూనీ చేయడాన్ని సహించలేనని చెప్పాడు. దానిని ఎవరు ఎలా అర్ధం చేసుకున్నా సరే...ఇప్పటికే భాష ఖూనీ అయిపోతోందని, దానిని మనం కూడా ఖూనీ చేస్తే తెలుగు తల్లి క్షమించదని పేర్కొన్నాడు. అలా చాలా పాటల్ని వదిలేసుకున్నానని, చాలా పెద్ద సినిమా పాటలను కూడా వదులుకోవాల్సి వచ్చిందని కారుణ్య చెప్పాడు. అయితే అలా చేసినందుకు తానేమీ బాధపడలేదని చెప్పాడు.

More Telugu News