: ఇద్దరమూ తన్నుకున్నాం... పోలీసులు కూడా వచ్చారు, అప్పుడే కేసును పరిష్కరిస్తే ఇంత జరిగేది కాదు: తేజస్విని

రాజీవ్ విషయంలో తను, శిరీష గొడవ పడ్డామని, ఒక రోజు ఇద్దరమూ తన్నుకుంటుంటే, విడదీయలేక రాజీవ్ స్వయంగా '100' నెంబర్ కి కాల్ చేసి పోలీసులను పిలిపించాడని, అప్పుడే కేసును పరిష్కరించి ఉంటే, ఇప్పుడింత దారుణం జరిగి ఉండేది కాదని శిరీష అనుమానాస్పద మృతి కేసులో సాక్షిగా పోలీసులు భావిస్తున్న తేజస్విని వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రాజీవ్ లేని సమయంలో తాను స్టూడియోకు వెళ్లి, అతన్ని వదిలివేయాలని వాగ్వాదానికి దిగానని, అప్పుడు తనను ఇద్దరు వ్యక్తులతో బెదిరించిందని, ఆపై కాసేపటికి రాజీవ్ వచ్చాడని రెండు నెలల క్రితం జరిగిన ఘటనను ఆమె పోలీసులకు వివరించింది. అప్పట్లో పోలీసులు వచ్చారే తప్ప, ఎటువంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొంది. వారిని రాజీవే పంపించి వేశాడని తెలిపింది.

ఫేస్ బుక్ లో శిరీష ఫోటోలను రాజీవ్ ట్యాగ్ చేసినప్పుడు తనకు తొలిసారిగా అనుమానం వచ్చిందని, అప్పట్లో బెంగళూరులో ఉన్న తాను, ఈ విషయమై రాజీవ్ కు ఫోన్ చేసి నిలదీశానని చెప్పింది. ఆమె బిజినెస్ పార్టనర్ అని రాజీవ్ చెబితే, తొలుత నమ్మానని, ఆపై వారిద్దరి మధ్యా ఉన్న అసలైన సంబంధం గురించి తెలుసుకుని, శిరీషను వదిలివేయాలని రాజీవ్ ను హెచ్చరించినట్టు చెప్పుకొచ్చింది. తమ మధ్య ఉన్నది అనుమానపు మాటల యుద్ధమేనని, దాని కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని తాను భావించడం లేదని, ఆమె మృతి వెనుక మరో బలమైన కారణం ఉండే ఉంటుందని తేజస్విని చెప్పినట్టు సమాచారం.

More Telugu News