: ఇండియా వెనుకే మేమూ నడుస్తాం: డొనాల్డ్ ట్రంప్

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతావని గుర్తింపు తెచ్చుకుందని గుర్తు చేస్తూ, త్వరలోనే తాము కూడా ఈ స్థాయిని అందుకునేందుకు కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో మోదీకి విందు ఇచ్చిన అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ ప్రసంగిస్తూ, మరో వారంలో అతిపెద్ద పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ అమలును ప్రారంభించనున్నారని గుర్తు చేసిన ఆయన, భారత పౌరులు వివిధ దేశాల్లో తమ సత్తాను చాటుతూ, కొత్త అవకాశాలను సృష్టిస్తున్నారని కొనియాడారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇండియా దార్శనికతతో ముందుకు వెళుతోందని, భారత్ ను అనుసరించేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించిన అవినీతిపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోందని, విజయం ఆయన్నే వరించాలని కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు. సరికొత్త ఆశావాద మార్గంలో భవిష్యత్ కు మార్గాన్ని సుగమం చేస్తూ, నూతన సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగంలో కలసికట్టుగా ముందుకు సాగేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. రెండు దేశాల్లో కొత్త ఉద్యోగాల సృష్టికి కలసి శ్రమించాలని పిలుపునిచ్చారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యాపార బంధాన్ని పెంచుకుందామని సలహా ఇచ్చారు. ఇరు దేశాల వ్యాపార వ్యవస్థలు మరింతగా వృద్ధి చెంది వాణిజ్య బంధం బలోపేతం కావాలని కోరారు.

 అమెరికా వస్తువులు మరిన్ని భారత్ కు ఎగుమతి అయ్యేలా అడ్డంకులను తొలగించాలని మోదీని కోరిన ట్రంప్, ఇండియాలో వాణిజ్య లోటు దిగిరావాల్సి వుందని గుర్తు చేశారు. భారత విమానయాన సంస్థ అమెరికన్ కంపెనీలకు 100 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులకు భవిష్యత్ భరోసాను ఇచ్చిందని పేర్కొన్నారు. ఇండియాకు ఇంధనాన్ని సరఫరా చేయాలని తాము భావిస్తున్నామని, సుదీర్ఘకాలం పాటు సహజవాయువును ఇండియాకు ఎగుమతి చేసే భారీ ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే దీనికి ఆమోదముద్ర పడుతుందని తెలిపారు.

More Telugu News