: పాకిస్థాన్‌ను అలా పిలవాలంటే నాకు అసహ్యం.. అమెరికా మాజీ దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌పై అమెరికా మాజీ దౌత్యవేత్త తెరెసిటా షాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు (మంగళవారం) సమావేశం కానున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్రీలంకకు అమెరికా రాయబారిగా పనిచేసిన షాఫర్ మాట్లాడుతూ పాకిస్థాన్‌ను మిత్రదేశం అని పిలవాలంటే తనకు అసహ్యంగా ఉంటుందన్నారు.

‘‘పాకిస్థాన్‌ను మిత్రదేశంగా పిలవడం నాకు అసహ్యం. చారిత్రకంగా కూడా అది నిజమే. ఎందుకంటే ఆ దేశంతో అటువంటి క్లిష్టమైన సంబంధాలు ఉన్నాయి’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించడం, మోదీ-ట్రంప్ సమావేశం.. ఇవన్నీ శుభపరిణామాలని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా-పాక్ బంధం క్లిష్టంగా మారిందని, భారత్‌కు అది శుభపరిణామమని చెప్పవచ్చని ఆమె తెలిపారు. కాగా, సోమవారం అమెరికా కార్యదర్శి రెక్స్ టిల్లర్‌సన్, రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మాటిస్‌లు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, ఆఫ్ఘనిస్థాన్‌, ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.

More Telugu News