: నా వల్ల టీడీపీకి చెడు జరగలేదు.. మంచే జరిగింది: ఎంపీ కేశినేని నాని

విజయవాడలో రవాణాశాఖ అధికారిపై జరిపిన దౌర్జన్యంతో టీడీపీ ఎంపీ కేశినేని నానికి కొంత మేర ఇమేజ్ డ్యామేజ్ అయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ మీడియా సంస్థతో కేశినేని మాట్లాడుతూ, తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. ఒక ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడని... దాని గురించి తాను అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. యాక్సిడెంట్ కు గురైన బస్సు తప్పుడు బస్సు అని తనకు తెలుసని... అందుకే బ్రేక్ ఇన్స్ పెక్టర్ ఇచ్చే ఒక కాపీని ఇవ్వాలని తాను అడిగానని చెప్పారు. ఆ బస్సు ఆరంజ్ ట్రావెల్స్ కు చెందినదని తెలిపారు.

ఆరంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కడప నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి, ఆ తర్వాత నిజామాబాద్ కు వలస వెళ్లాడని చెబుతుంటారని నాని తెలిపారు. ఈసారి నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేస్తాడని కూడా కొందరు చెబుతున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్నప్పుడు కవిత మనిషినని చెప్పుకుంటారని, ఏపీకి వచ్చినప్పుడు ఆరెస్సెస్ మనిషినని చెప్పుకుంటారని ఆరోపించారు.

రెండు మూడేళ్ల నుంచే అతను ట్రావెల్స్ వ్యాపారంలో కనపడుతున్నాడని... ఈ మధ్య కాలంలో తన ట్రావెల్స్ ను 180 బస్సులకు పెంచాడని... ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్లే అని చెప్పారు. క్రైం చేయడం అతనికి బాగా తెలుసని... పన్నులు కట్టకుండా బస్సులు తిప్పుతున్నారని ఆరోపించారు. తన వల్ల పార్టీకి ఎలాంటి చెడు జరగలేదని, మంచే జరిగిందని చెప్పారు. తన నియోజకవర్గం కోసం చాలా కష్టపడి పని చేస్తున్నానని... సుమారు రూ. 4 వేల కోట్ల పనులు విజయవాడకు మంజూరయ్యాయని తెలిపారు.


More Telugu News