: ఉగ్రవాదులపై నిఘాకోసం 13 ఉపగ్రహాలను ఉపయోగిస్తున్న ఇండియన్ ఆర్మీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శుక్రవారం ప్రయోగించిన కార్టోశాట్-2ఈతో కలుపుకుని భారత ఆర్మీ ప్రస్తుతం 13 శాటిలైట్లను ఉగ్రవాదుల కదలికలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తోంది. వీటిని సరిహద్దుల్లో పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తున్నా అంతకంటే ముఖ్యంగా నేల మీది నుంచి, సముద్ర మార్గం ద్వారా వచ్చే శత్రువుల కదలికలను గుర్తించేందుకే ఉపయోగిస్తున్నారు. ఆర్మీ ఉపయోగిస్తున్న ఉపగ్రహాల్లో చాలా వరకు సమీప భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. దీనివల్ల భూమిని మరింత క్షుణ్ణంగా పరిశీలించే వీలుంటుంది. తాజాగా ప్రయోగించిన కార్టోశాట్-2ఈ శాటిలైట్‌కు సీన్-స్పెసిఫిక్ స్పాట్ ఇమేజినరీ అందించే సామర్థ్యం ఉంది. ఇది 0.6 X 0.6 చదరపు మీటర్లలోని వస్తువులను చాలా కచ్చితంగా గుర్తించి సమాచారం ఇవ్వగలదు.

నేవీ కూడా జీశాట్-7ను సేవలను ఉపయోగించుకుంటోంది. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, విమానాలు, ఇతర ప్రదేశాలతో కమ్యూనికేషన్ కోసం దీని సేవలను నేవీ వినియోగించుకుంటోంది. భారత్‌కు ఉపగ్రహాలను ధ్వంసం చేయగలిగే యాంటీ శాటిలైట్ వెపన్(ఏఎస్ఏటీ)ను ప్రయోగించే సత్తా కూడా ఉందని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ తపన్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఇటువంటి వాటిని అమెరికా, రష్యా, చైనాలు అభివృద్ధి చేశాయని ఆయన తెలిపారు. అయితే ఇటువంటి ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టడం ఇస్రో ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News