: చంద్రబాబూ! మీరు పాదయాత్ర చేసింది రాజశేఖరరెడ్డి వేసిన రోడ్ల మీదే!: ఎమ్మెల్యే రోజా

నాడు చంద్రబాబునాయుడు పాదయాత్ర చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన రోడ్ల మీదేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ, అర్హులకు పింఛన్ రాకుండా స్థానిక టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రజలు కట్టే పన్నులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం మర్చిపోతోందని విమర్శించారు.

"‘చంద్రబాబునాయుడు తన తండ్రి కర్జూరపునాయుడు ఆస్తితో ప్రజలకేమీ పెన్షన్లు ఇవ్వట్లేదు, రోడ్లు వేయడం లేదు. తన మామ ఎన్టీఆర్ ఆస్తితో ఏమీ రోడ్లు వేయట్లేదు. చంద్రబాబు, ఆయన కొడుకు అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న డబ్బుతో ఈ రాష్ట్రానికి పెన్షన్ లు ఇవ్వట్లేదు, రోడ్లు వేయడం లేదు. ప్రజలు కట్టిన ట్యాక్సులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ‘జన్మభూమి’ కమిటీలు పెట్టి అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారో, రేషన్ కార్డులు తీసేసి వాళ్ల కుటుంబాలను ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే.

మాకు ఓటెయ్యకపోతే మీకు ఏదీ ఇవ్వము, ఏదీ తీసుకోకూడదంటున్నారే!, మరి, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డిగారు కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు గానీ వేసిన రోడ్లపై మీరు ఏ విధంగా నడిచారు? వారిచ్చిన సబ్సిడీ గ్యాస్ ఏ విధంగా తీసుకున్నారు? మీ పార్టీ వాళ్లు మరి కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్లు కానీ, రేషన్లు కానీ ఎలా తీసుకున్నారు? అలాగైతే, మీకు ఎందుకు ఓట్లేశారు? మీరు పాదయాత్ర చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్ల మీదే. అలాంటి రోడ్ల మీద నడిచిన మీరు, ‘టీడీపీకి ఓటెయ్యండి’ అని ఎలా మాట్లాడారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను" అంటూ సీఎం చంద్రబాబును రోజా ఘాటుగా ప్రశ్నించారు.

More Telugu News