: కూర'గాయాలు'... ఆకాశానికి టొమాటో, అదే దారిలో బెండ, కాకర!

కొన్ని వారాల క్రితం వరకూ అన్ని వర్గాలకూ అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఇప్పుడు చుక్కలు చూపుతున్నాయి. పంట దిగుబడి తగ్గడంతో ఏపీఎంసీ (అగ్రికల్చర్ ప్రొడక్యూస్ మార్కెట్ కమిటీ) యార్డుల్లో కూరగాయల ధర మండిపోతోంది. ప్రభుత్వ అధీనంలోని అగ్ మార్క్ నెట్ గణాంకాల ప్రకారం, బెండకాయల ధర నెల రోజుల వ్యవధిలో 80 శాతం పెరిగి కిలోకు రూ. 45కు చేరింది. ఇది అహ్మదాబాద్ పరిస్థితి కాగా, బెంగళూరులో ధర రెట్టింపైంది. ముంబై, కోల్ కతా నగరాల్లోని ఏపీఎంసీల్లో బెండకాయల ధర కిలోకు 11 శాతం వరకూ పెరిగింది. కాకరకాయ విషయానికి వస్తే, మే నెలతో పోలిస్తే, ధర 20 శాతం పెరిగింది. ఇక, ఓ నిత్యావసర కూరగాయగా, ప్రతి ఇంట్లో రోజూ వాడే టొమాటో ధర ఏకంగా మూడు రెట్లు పెరిగింది.

పంటలకు నీరు లభించని కారణంగానే దిగుబడి తగ్గిపోయిందని వెజిటబుల్ గ్రోవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రామ్ గధావే వ్యాఖ్యానించారు. సమీప భవిష్యత్తులో ధరలు మరింతగా పెరగవచ్చని అన్నారు. వర్షాలు కురిసి కొత్త పంట వచ్చే వరకూ పరిస్థితి ఇలానే ఉంటుందని అంచనా వేశారు. నేషనల్ అగ్రికల్చర్ బోర్డు గణాంకాల ప్రకారం, గత నెలతో పోలిస్తే, ఈ నెలలో మార్కెట్ కు వస్తున్న పంట కూడా తగ్గిపోయింది. మరో రెండు నెలల పాటు ధరల పెరుగుదల కనిపిస్తుందని వాషి కేంద్రంగా కూరగాయల టోకు వ్యాపారం చేసే సంజయ్ భుజ్ లాల్ వ్యాఖ్యానించారు.

కాగా, కేంద్ర వ్యవసాయ శాఖ అంచనాల మేరకు గత సంవత్సరం 169 మెట్రిక్ టన్నులుగా ఉన్న కూరగాయల ఉత్పత్తి, ఈ సంవత్సరం 175 మిలియన్ టన్నులకు పెరగవచ్చని పేర్కొంది. ఈ ఏడు 10.29 మిలియన్ హెక్టార్లలో కూరగాయలను పండిస్తున్నారని, వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయన్న అంచనాలతో సాధ్యమైనంత త్వరగానే ధరలు దిగివస్తాయని ఓ ప్రభుత్వ అధికారి వ్యాఖ్యానించారు.

More Telugu News