: కశ్మీర్‌లో అల్లర్ల కోసం రూ.50 కోట్లు పంపిన హఫీజ్ సయీద్.. వనీ మరణం తర్వాత అల్లర్లకు కుట్ర!

గతేడాది కశ్మీర్‌లో భద్రతా దళాల చేతిలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మృతి చెందిన తర్వాత లోయలో అల్లర్లు రేపేందుకు జమాత్-ఉద్-దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ కశ్మీర్‌కు రూ.50 కోట్లు పంపినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ నిగ్గుతేల్చింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో మోస్ట్ వాంటెడ్ అయిన హఫీజ్‌పై తాజాగా ఈ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లోయలో ఉగ్ర కార్యకలాపాల కోసం నిధులు సమకూరుస్తున్న ఆరోపణలపై ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.

అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా శనివారం మనీలాండరింగ్ కోణంలో ఆయనపై కేసు నమోదు చేసింది. హవాలా, సీమాంతర వ్యాపారం ద్వారా లోయలోకి సొమ్ము చేరుతున్న వైనంపై కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థతో కలిసి ఎన్ఐఏ పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించింది. హవాలా ద్వారా కశ్మీర్‌లోకి చేరుతున్న సొమ్ము ఉగ్రవాదులకే కాకుండా వేర్పాటు వాదులకు కూడా అందుతున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. వేర్పాటు వాదులు ఆ సొమ్మును భద్రతాదళాలపైకి రాళ్లు విసిరే వారికి అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News