: నిరుద్యోగులను నిలువునా ముంచి బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ సంస్థ

హైదరాబాదులో భారీ వేతనాల ఆశచూపి నిరుద్యోగుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసిన ఓ సాఫ్ట్ వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. సోమాజిగూడలోని ఫోర్డ్‌ షోరూం రెండో అంతస్తులో సెంట్రిక్స్‌ టెక్‌ పేరుతో సాఫ్ట్‌ వేర్‌ శిక్షణ సంస్థను రాజీవ్‌ అలియాస్‌ రాహుల్‌ రెడ్డి సీఈవోగా, కార్తీక్‌ అలియాస్‌ రాజేష్‌ రెడ్డి సంస్థకు ఇన్‌ చార్జిగా ఏర్పాటు చేశారు. నిరుద్యోగులను నిలువునా ముంచేందుకు ముందుగానే స్కెచ్ వేసుకున్న వీరిద్దరూ కంప్యూటర్‌ లతో పాటు ఇతర ఆఫీసు సామగ్రిని కూడా అద్దెకు తీసుకున్నారు. అనంతరం సాఫ్ట్ వేర్ శిక్షణతోపాటు ఉద్యోగం కూడా ఇస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు గుప్పించారు. మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఏడాదికి 2.60 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు.

ఒకవేళ ఉద్యోగం రాని పక్షంలో నెలకు 12  వేల రూపాయలు జీతంగా చెల్లిస్తామని చెప్పారు. అయితే తాము ఇచ్చే శిక్షణకు 1.3 లక్షల రూపాయల నుంచి 1.8 లక్షల వరకు ఖర్చవుతుందని నమ్మించారు. దీంతో ఉద్యోగం ఆశతో 59 మంది వారికి డబ్బులిచ్చారు. శిక్షణలో ఉన్నవారికి 12 వేల చొప్పున ఇస్తున్నారు. అయితే, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డబ్బులివ్వడం లేదు. దీంతో వారు వచ్చి నిలదీయడం ఆరంభించారు. వారి ఒత్తిడి తట్టుకోలేని రాజీవ్, కార్తీక్ లు సెల్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. దీంతో బాధితులు ఆఫీసుకు వెళ్లగా, రెంట్ చెల్లించలేదని చెబుతూ కంప్యూటర్లు, ఫర్నిచర్ ను అద్దెకిచ్చినవాళ్లు తీసుకెళ్లిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారిద్దరూ పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News