: ఏసీబీ చరిత్రలో అతి పెద్ద అవినీతి కేసు ..పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు రూ.500 కోట్లకు పైగా అక్రమాస్తులు!

విశాఖపట్టణంలో ప్రజారోగ్య శాఖ విభాగంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పనిచేస్తున్న పాము పాండురంగారావు అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంపై ఏసీబీ దాడులు చేసింది. రూ.500 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కేసును ఏసీబీ చరిత్రలో అతిపెద్ద అవినీతి కేసుగా అధికారులు పరిగణిస్తున్నారు. పాండురంగారావు ఆస్తులు ఆరు జిల్లాల్లో విస్తరించాయని సమాచారం. విశాఖలో రూ.8 కోట్లతో అశ్విని ఆసుపత్రి నిర్మాణం, 44 ఫ్లాట్లు (విశాఖలోనే 20 ఫ్లాట్లు), హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఎకరం భూమి, పలు చోట్ల షాపింగ్ కాంప్లెక్స్ లు, 8 బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రొఫెసర్ విజయ్ కుమార్ తో పార్టనర్ షిఫ్ ఉందని, పాండురంగారావు ఇంట్లో రూ.9 లక్షల నగదు, కిలో బంగారం, 10 కిలోల వెండి నగలు, భారీగా అమెరికన్ డాలర్లు, రద్దయిన రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో 24 ఎకరాల పొలం, పాండురంగారావు కొడుకు సుధీర్ పేరుపై సోలార్ పవర్, సునీల్ ఎంటర్ ప్రైజెస్ లో రూ.66 లక్షల పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించామని అన్నారు.

లంకెలపాలెంలో 14,070 గజాల ప్లాట్, రెండు ఇళ్ల స్థలాలు, కాకినాడలో 400 చదరపు గజాల స్థలంకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లభించాయి.  ప్రొఫెసర్ విజయ్ కుమార్ ఇంటిపై దాడులు చేసి రూ.2.6 కోట్ల అక్రమాస్తులు గుర్తించామని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని, మాదవధారలోని విజయ్ కుమార్ ఇంటి నుంచి 2.6 కిలోల బంగారం, 3.8 కిలోల వెండి, బ్యాంక్ లాకర్ కీను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏసీబీ డీజీ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ దాడులకు దిగామని చెప్పారు.

More Telugu News