: కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం 16 లక్షలు వెచ్చించిన ఢిల్లీ వాసి!

ఆర్టీవో నిర్వహించే వేలం పాటలో కార్లకు తమకు ఇష్టమైన ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకునేందుకు చాలా మంది వాహన యజమానులు పోటీ పడుతూనే ఉంటారు. అందుకోసం, ఎంత మొత్తం అయినా చెల్లించేందుకు వాహన యజమానులు సిద్ధపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో పామ్ ల్యాండ్ హాస్పిటాలిటీ ప్రైవేటు లిమిటెడ్ యజమాని తన కొత్త కారు కోసం ‘0001’ అనే నెంబర్ ను రూ.16 లక్షలకు దక్కించుకున్నాడు. ఈ నెంబర్ కోసం రాజకీయనాయకులు, పారిశ్రామికవేత్తలు సహా మొత్తం 30 మంది బిడ్డింగ్ వేశారు. చివరకు, పెద్దమొత్తంలో చెల్లించిన సదరు సంస్థ యజమాని ‘0001’ నెంబర్ ను దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ సిటీ ట్రాన్స్ పోర్ట్ స్పెషల్ కమిషనర్ కెకె దహియా మాట్లాడుతూ, గత ఆరు నెలల్లో 29 ఫ్యాన్సీ నెంబర్లను వేలం వేయడం ద్వారా రూ.54.70 లక్షలు, గత ఏడాది 151 ఫ్యాన్సీ నెంబర్లు వేలం వేయడం ద్వారా రూ.2.29 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. వాహన యజమానులకు ఈ ఫ్యాన్సీ నెంబర్లపై మోజు మరింతగా పెరుగుతోందని అన్నారు. ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకోవాలనే వారి సంఖ్య ఈ దీపావళి పండగకు మరింత పెరిగే అవకాశాలున్నట్టు అభిప్రాయపడ్డారు.  

More Telugu News