: గీత దాటితే ఎంత నష్టమో చూసుకోండి... 'బుమ్రా నోబాల్'తో పోలీసుల వినూత్నత!

చాంపియన్స్ ట్రోఫీలో భారత తలరాతను మార్చిన 'జస్ ప్రీత్ బుమ్రా నోబాల్' గుర్తుందిగా? ఆ బాల్ కు పాక్ బ్యాట్స్ మన్ ఫఖర్ జమాన్ అవుట్ అయినప్పటికీ, నో బాల్ కావడంతో బతికిపోయి, సెంచరీతో చెలరేగాడు. ఇక ఈ ఘటనను రోడ్ సేఫ్టీ లక్ష్యాలను సాధించేందుకు వాడుకోవాలన్న వినూత్న ఆలోచనతో జైపూర్ పోలీసులు 'బుమ్రా నో బాల్'తో సరికొత్త ప్రచారాన్ని చేస్తున్నారు. బుమ్రా చేసిన తప్పు ఖరీదైనదని, ఓటమిని దగ్గర చేస్తుందని చెబుతూ, ఓ సీరియస్ మెసేజ్ ని తయారు చేశారు.

 "గీత దాటితే పెను మూల్యాన్ని చెల్లించాల్సి వుంటుంది" అని ప్రచారం చేస్తూ, బుమ్రా నోబాల్ వేస్తున్న దృశ్యాన్ని, పక్కనే సిగ్నల్ లైన్ ముందు ఆగిన వాహనాల చిత్రాన్ని ఉంచి ప్రచారం చేస్తున్నారు. క్రికెట్ లో జరిగిన ఈ ఘటన నిబంధనలు పాటించని ప్రజల్లో మార్పునకు సహకరిస్తుందని భావిస్తున్నామని జైపూర్ పోలీస్ కమిషనర్ సంజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. సాధారణంగా నిబంధనలు అతిక్రమించే వారిలో యువతే అధికమని, అందువల్లే యువకుడైన బుమ్రాను తమ ప్రచారానికి వినియోగిస్తూ, తప్పు చేస్తే జరిగే పరిణామాలపై హెచ్చరించడమే తమ ఉద్దేశమని అన్నారు.

More Telugu News