: విశాఖలో జగన్ కు షాక్ ఇచ్చిన భూ బాధితులు!

విశాఖపట్నంలోని భూ కుంభకోణంపై వైసీపీ అధినేత జగన్ నిన్న 'మహా ధర్నా' నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భూమిని కోల్పోయిన పలువురు బాధితులతో వేదికపై జగన్ మాట్లాడించారు. ఈ సందర్భంగా జగన్ కు ఊహించని షాక్ తగిలింది. బాధితులకు ఏం సమాధానం చెప్పాలో ఆయనకు అర్థం కాని పరిస్థితి ఎదురైంది.

మాజీ సైనికోద్యోగి ఖాదర్ బాషా మాట్లాడుతూ, 2005లో ప్రభుత్వం తనకు భూమిని కేటాయించిందని 2008లో మళ్లీ తిరిగి లాక్కుందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి జగన్ ఏమీ మాట్లాడలేక పోయారు. ఎందుకంటే, 2008లో ఆయన తండ్రి రాజశేఖరరెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోవింద్ అనే మరో బాధితుడు మాట్లాడుతూ, పరవాడ మండలం లంకెల పాలెంలో 5.07 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని... 2010లో దీని రికార్డులను మార్చేశారని తెలిపారు. దీనిపై కూడా జగన్ స్పందించలేక పోయారు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు బొత్స, ధర్మానలు అప్పడు మంత్రులుగా కొనసాగుతున్నారు.

మరో విషయం ఏమిటంటే... ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్న విశాఖ భూ కుంభకోణం మధురవాడ, కొమ్మాదిల చుట్టూ తిరుగుతోంది. అయితే, ఈ ప్రాంతాలకు చెందిన వారెవరూ ఆ భూ వివాదంపై మాట్లాడలేదు. ఈ విషయం వైసీపీ నేతలను సైతం ఆశ్చర్యపరిచిందని చెప్పుకుంటున్నారు. 

More Telugu News